హైదరాబాద్ సిటీలో పలు రైళ్ల రాకపోకలకు సాంకేతిక అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మౌలాలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది.ఈ అంతరాయం కారణంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు రైళ్లు ఒకటి నుంచి రెండు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం.
మౌలాలీ వద్ద రైళ్ల నిలిపివేత
మౌలాలీ దాటిన తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్ సుమారు గంటపాటు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు పల్నాడు ఎక్స్‌ప్రెస్ కూడా మౌలాలీ వద్ద నిలిచిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను డీజిల్ ఇంజిన్ సాయంతో ముందుకు పంపినట్లు సమాచారం.విశాఖ ఎక్స్‌ప్రెస్ సైతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు రైళ్ల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో తమ ప్రయాణ సమయాలపై ప్రభావం పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి సిబ్బంది పనిచేస్తున్నారు.
కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు మార్గం మార్పు
సాంకేతిక సమస్య ప్రభావంతో 17659 సికింద్రాబాద్–భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు మార్గంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలును మల్కాజ్‌గిరి మార్గంలో నడపనున్నట్లు వెల్లడించారు.
అలాగే కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు మౌలాలీ స్టేషన్‌లో స్టాప్‌ను రద్దు చేసినట్లు సమాచారం. పరిస్థితిని బట్టి మరిన్ని రైళ్ల విషయంలోనూ మార్పులు చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
సాంకేతిక సమస్య పూర్తిగా పరిష్కరించే వరకు ప్రయాణికులు తమ రైళ్ల తాజా రాకపోకల సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రయాణం కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.
