వెలుగు స్పెషల్ :దిగజారిన ప్రతిష్టతో ‘దిద్దుబాట్లు’ వద్దు..వివాదాల నడుమ సుడిగుండంలో భారత ఎన్నికల సంఘం

వెలుగు స్పెషల్ :దిగజారిన ప్రతిష్టతో ‘దిద్దుబాట్లు’ వద్దు..వివాదాల నడుమ సుడిగుండంలో భారత ఎన్నికల సంఘం

ప్రతిష్టాత్మక భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వివాదాల సుడిగుండంలో కొట్టుకుంటోంది.  మునిగేనా? తేలేనా? అన్నది అది నిలబెట్టుకునే విశ్వసనీయతను బట్టి ఉంటుంది. అంబేద్కర్ ఏనాడో సందేహించినట్టు, అధికారంలో ఉన్నవారి  చెప్పుచేతల్లోకి ఈసీ జారిపోతే  దేశంలో ఎన్నికల ప్రక్రియ,  ప్రజానిర్ణయ ఫలితాలు, అంతిమంగా రాజకీయాలు భ్రష్టుపట్టిపోతాయన్నది నిజమయ్యే పాడుకాలం దాపురిస్తోంది. 

లోగడ  ఓ  రాజ్యాంగ సంస్థ పనితీరును తూర్పారబడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ‘పంజరంలో చిలుక పలుకులు’ పలుకొద్దంది.  ఇది పలుకులతో ఆగేది కాదు,  అన్ని  రాజ్యాంగ వ్యవస్థల్ని చెరబట్టే విస్తృత కుట్రలో భాగం.  పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బాగుచేయడం  రాజ్యాంగ ప్రక్రియగా జరిగితే సరే!  లేదంటే,  ప్రజా సమూహాలు ఉద్యమించి, మెడలు వంచి సాధించుకుంటాయని నిన్నటి  ‘జంతర్ మంతర్‌’ అనుభవం నేర్పింది.  సీఈసీ తప్పుకోకుంటే మరో జంతర్‌ మంతర్ తప్పదని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.

ఈసీఐకి  నేతృత్వం వహించే ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్  దేశ ప్రజల విశ్వాసం కోల్పోయారు.  ఆయన్ని తక్షణం పదవి నుంచి తప్పించాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయి.  పార్లమెంటులో అభిశంసనకు మూడోసారి నోటీసు ఇవ్వడానికి విపక్షాలు సంసిద్ధమవుతున్నాయి.  

దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ‘సర్’ ప్రక్రియతోపాటు పలు కీలక విషయాల్లో  ఎన్నికల సంఘంలో  ఏకాభిప్రాయం లేకపోవడం,  దేశంపై రుద్దుతున్న  ఏకపక్ష నిర్ణయాలను వారంతా ఈసడిస్తున్నారు. ఇవే విషయాలను  తేటతెల్లం చేస్తూ ప్రచురించిన ఓ ఆంగ్ల దినపత్రిక పరిశోధనాత్మక కథనాలు విపక్షాల  నైతిక పోరాటానికి ఊతమిస్తున్నాయి. 

 కీలకమైన  అంశాల్లో ఎన్నికల సంఘంలోని  ముగ్గురు కమిషనర్ల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఇద్దరు కమిషనర్లు విబేధించినప్పటికీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్షంగా తన నిర్ణయాల్ని అమలుచేయడం జరుగుతూ వస్తోందన్న పరిశోధన నివేదిక విస్మయం కలిగిస్తోంది.

‘సర్’పై తీవ్ర వివాదాలు

బిహార్,  పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణ తీవ్ర వివాదాలు రేపింది. లక్షలాది మంది ఓటర్లు ఈ సవరణల్లో తమ ఓటు కోల్పోయారు. అర్హులైనవారు  ఫిర్యాదులు చేసినా, ట్రిబ్యునల్స్​ని సంప్రదించినా ఓటు వేసుకోలేకపోయారు. సుప్రీంకోర్టు తలుపుతట్టినా వారికి అవకాశం లభించలేదు.  

పశ్చిమ బెంగాల్‌లో ట్రిబ్యునల్‌కు వెళ్లిన 22 లక్షల మందిలో, సెప్టెంబరు 10 నాటికి 1.22 లక్షల మందిపై దర్యాప్తు పూర్తయితే 1.14 లక్షల మంది అర్హులైన ఓటర్లే అని తేలింది. ఇలా బెంగాల్‌లోనే  కాదు బిహార్‌‌లో, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో జరిగింది. ‘జాబితా సవరణ పేరుతో అసలు ఓటర్లను ఓటింగ్‌కు రానీయకుండా తొక్కిపెట్టి జరిపించినవి ఎన్నికలే కావు, తిరిగి ఎన్నికలు జరిపించండి’ అని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే (శివసేన) వంటి నాయకులు డిమాండ్ 
చేస్తున్నారు.  

లోపభూయిష్టమైన ‘సర్‌’ను తప్పుబడుతూ, వికాశ్‌శీల్ఇన్సాఫ్ పార్టీ (వీఐపీ) అధ్యక్షుడు, బిహార్ మాజీ మంత్రి ముఖేశ్ సహానీ ఒక తీవ్రవ్యాఖ్య చేశారు. ‘ఒక హత్యకు  నాకు క్షమతో  కూడిన అనుమతి ఉంటే,   సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌ను హతమారుస్తా’ అన్నారంటే,  నిర్హేతుకంగా ఓటు పోయినవాళ్లలో ఇంకెంత 
ఆగ్రహావేశాలున్నాయో?

తాజా ‘సర్‌’ రాష్ట్రాల పరిస్థితేంటి?

సర్  ఫేజ్-3  రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం 19 రాష్ట్రాలు,  కేంద్రపాలిత  ప్రాంతాల్లో జరుగుతోంది. ఇప్పటివరకు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. పేర్లలోనో,  ఇంటిపేర్లలోనో,  పుట్టిన తేదీలోనో,  మరి దేంట్లోనో  తేడా ఉందనే  కారణాలతో జాబితా నుంచి పేర్లు తొలగించారు.  నోటీసుతో  సరిదిద్దుకునేందుకు  అవకాశం ఇచ్చారు. 

 కొన్నిచోట్ల సవరణ జరుగుతోంది. అయితే ముఖ్యంగా దిన కూలీలు, చిరు ఉద్యోగులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు, నిరుపేదలు  నోటీసులకు స్పందించి, అదనపు సమాచారం ఇచ్చి తమ పేర్లు జాబితాలో చేర్పించుకోవడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.  కానీ, సీఈసీ స్థాయిలో ఇవన్నీ ఏకపక్ష నిర్ణయాలని, ‘సర్‌’ ప్రక్రియలో ఉన్న నిబంధనల్ని మార్చకుండా అదనపు నిబంధనల్ని చేర్చడాన్ని ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారనే అంశం అప్పటికి ప్రజాక్షేత్రంలో లేదు.  ఇంకా ఏయే విషయాల్లో కమిషన్‌లో  ఏకాభిప్రాయం సాధించకుండానే,  సీఈసీ  కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేస్తూ, ఈసీ  స్వతంత్ర ప్రతిపత్తిని  మంటకలిపారన్నదీ  తెలియదు. 

ఫారం- 6లో  మార్పులు చట్ట వ్యతిరేకం?

నెలల తరబడి కమిషనర్లు సమావేశమై ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్నదే లేదని సమాచారం. ఎన్నికల సంఘంలో ముందు పనిచేసిన ‘ఎలక్టోరల్  రిజిస్ట్రేషన్  నెట్‌వర్క్ (ఈఆర్‌వో- నెట్) కానీ, తదనంతరం దాని విలీనం ద్వారా సమీకృతం చేసుకున్న  ‘ఎలక్షన్  కమిషన్  ఇన్ఫర్మేషన్‌  నెట్‌వర్క్’ (ఈసీఐ- నెట్)గానీ  సందేహాలకతీతంగా  పనిచేస్తున్న వెబ్‌సైట్లు కావనేది మిగతా ఇద్దరు కమిషనర్ల  భావన.  

ఫారం-–6లో  మార్పుల పట్ల వారు వ్యక్తం చేసిన అభ్యంతరాలనే  వ్యక్తం చేసిన మాజీ  సీఈసీ ఓపీ రావత్ అవి తప్పుమాత్రమే కాదు, చట్టవ్యతిరేకమని కూడా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ (కాంగ్రెస్),  కేజ్రీవాల్ (ఆప్). అఖిలేశ్‌ యాదవ్ (ఎస్పీ), మమతా బెనర్జీ (టీఎంసీ) వంటి రాజకీయ పార్టీల నాయకుల విమర్శలు సరేసరి!  కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కేతోపాటు వివిధ పౌర సమాజ సంస్థల వారూ సర్ ప్రక్రియను, ఎన్నికల సంఘం పనితీరును విమర్శిస్తూ వస్తున్నారు. యోగేంద్ర యాదవ్, పరకాల ప్రభాకర్ వంటి నిపుణులు, విశ్లేషకులు ఈ ప్రక్రియలోని  లోపాల్ని  ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఎప్పట్నుంచో వివరిస్తున్నారు.

ఈసీ ప్రతిష్ట మరింత దిగజారే సంకేతాలు

టి.ఎన్‌.శేష‌న్‌,  లింగ్డో,  కె.జె.రావు వంటి వారు ఎన్నిక‌ల సంఘం ప్రతిష్టను  ఇనుమ‌డింప‌జేస్తే  జ్ఞానేశ్ కుమార్ దాన్ని దిగ‌జార్చారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్  జ్ఞానేశ్ కుమార్ వైదొలగాలనే డిమాండ్ ఇటు రాజకీయ అటు ప్రజాక్షేత్రం నుంచి పెరుగుతోంది. 

 ఈ సంవత్సరం మార్చిలోనే జ్ఞానేశ్‌కుమార్​పై అభిశంసనకు లోక్‌సభలో 130,  రాజ్యసభలో 63 మంది సభ్యుల సంతకాలతో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన నోటీసును పార్లమెంటు ఉభయ సభాపతులు  తిరస్కరించారు.  తొమ్మిది  నిర్దిష్ట  అభియోగాలతో  విపక్ష పార్టీలు మళ్లీ  ఏప్రిల్ నెలలో  రెండోమారు నోటీస్ ఇచ్చాయి. 73 మంది రాజ్యసభ సభ్యులతో ఇచ్చిన నోటీస్ ఇంకా సభాపతి వద్ద పెండింగ్‌లో ఉంది.  

తాజా సమాచారం, పరిణామాల  ఆధారంగా  మూడోసారి  నోటీస్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.  తాజా నోటీసులతో పరిస్థితి అభిశంసన తీర్మానం వరకు వచ్చినా, రాకున్నా, అది నెగ్గినా,-  వీగినా... ప్రజాక్షేత్రంలో ఈసీ పలుచనయ్యే ఆస్కారం మెండుగా ఉంది.  ఎందుకంటే  సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా వివాదాస్పదం కావడం ఒక అంశమయితే, ఎన్నికల సంఘంలో కమిషనర్ల కూర్పు అంశం కూడా వివాదాస్పదమై  సుప్రీంకోర్టుకెక్కింది.

దేశవ్యాప్త నిరసనలు

ఇదివరకున్నట్టు ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక సిఫారసు కమిటీలో దేశ ప్రధాని, విపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని,  ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి స్థానంలో  ప్రధాని నియమించిన సీనియర్ కేంద్ర మంత్రి ఉండాలని తెచ్చిన నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుత కమిషనర్లు ముగ్గురూ తాజా నిబంధన తర్వాత నియమితులైన వారే! ఇప్పుడీ కేసు విచారణ విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లనుంది.

 ఎన్నికల సంఘం పాలన- నిర్వహణాధికారమే సీఈసీకి ఉంటుంది తప్ప, మిగతా అన్ని విషయాల్లో ముగ్గురు కమిషనర్లకు సమానాధికారాలుంటాయని కమిషన్ చట్టం చెబుతోంది. అందుకు విరుద్ధంగా,  ఇద్దరు ఇతర కమిషనర్ల అభిప్రాయాలను, వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే అంశాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. 

పది నెలల కాలంలో 14 అభ్యంతరాలను నిర్ద్వందంగా తోసిపుచ్చి ఏకపక్షంగా వ్యవహరించడమేమిటి? అన్నది వారి ప్రశ్న.  సీఈసీ దిగిపోవాలనే డిమాండ్‌తో  వామపక్ష పార్టీలు సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. 

ఈ నెల 29న జరిగే వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ)లో ఇదే అంశంపై దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 48 గంటల్లో  సీఈసీ దిగిపోకుంటే ‘జంతర్ మంతర్.02’ ఖాయమంటోంది  కాక్రోచ్ జనతా పార్టీ!  ఇదీ పరిస్థితి!

- దిలీప్ రెడ్డిపొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.