వచ్చే నెల ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు

వచ్చే నెల ఆర్టీసీలో  గుర్తింపు సంఘం ఎన్నికలు
  •     ఫస్ట్​వీక్​లో నోటిఫికేషన్.. ఆర్టీసీ బోర్డు మీటింగ్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బోర్డు సమావేశం నిర్ణయించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, రెండు, మూడో వారం మధ్యలో పోలింగ్ నిర్వహించాలని బుధవారం బస్ భవన్ లో సమావేశమైన బోర్డు సమావేశం నిర్ణయించింది. ఎండీ నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో సభ్యుల హోదాలో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, ఆర్టీసీ బోర్డు కార్యదర్శి వెంకన్న, ఆర్టీసీ ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారిగా నియమితులైన కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సునీతాదాస్ గోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని బస్సు స్టేషన్లు, డిపోల్లో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులు, ఇతర అవసరాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సిటీ శివారులోని గాజుల రామారంలో అధునాతన బస్సు స్టేషన్ కోసం ప్రభుత్వం కేటాయించిన వంద ఎకరాల భూమి ఆక్రమణకు గురికాకుండా ప్రహరీ నిర్మించనున్నారు. సమ్మె విరమణ సందర్భంలో కార్మికులకు హామీలు, అందులో నెరవేరిన అంశాలు, ఇంకా పెండింగ్ లో ఉన్న హామీలపై కూడా సమీక్ష చేశారు.