- సదరన్ డిస్కమ్సీఎండీ జితేశ్ వి.పాటిల్ ఆదేశం
- అన్ని సర్కిళ్ల ఇంజినీర్లతో టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: వాతావరణ శాఖ చేసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికల నేపథ్యంలో అన్నీ సర్కిళ్లలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని సదరన్డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్ ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. గంటకు 30 నుంచి -40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం ఆయన హైదరాబాద్‌లోని హెడ్ఆఫీస్ నుంచి సదరన్డిస్కమ్పరిధిలో పనిచేస్తున్న అన్నీ జోన్ల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్, డివిజనల్ఇంజినీర్లతో టెలీకాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈ సందర్భంగా జితేశ్ వి. పాటిల్ మాట్లాడుతూ.. వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్, అవసరమైన విద్యుత్ సామగ్రి, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు పడే అవకాశం ఉన్నందున ట్రీ ప్రూనింగ్ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
బ్యాటరీ ఆధారిత ట్రీ ప్రూనర్లు, చైన్‌సాలు, భద్రతా కిట్లు, హైడ్రాలిక్ పరికరాలు తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి 33/11 కేవీ సబ్‌స్టేషన్, ఫీడర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని సిబ్బంది ఫీల్డ్‌లో నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని, నీటిమునిగే ప్రాంతాలు, చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారానికి 1912 కాల్ సెంటర్, సోషల్ మీడియా, స్థానిక కార్యాలయాల ద్వారా వచ్చే సమాచారం పై వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు తెగిపడి కనిపించినా, విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నా ప్రజలు వాటికి దూరంగా ఉండి వెంటనే టీజీఎస్పీడీసీఎల్‌కు సమాచారం అందించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు.
