- డబ్బు ఎక్కడిదనే క్లారిటీ ఇవ్వలేకపోయారని వెల్లడి
న్యూఢిల్లీ: ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మను పార్లమెంటరీ ప్యానెల్ దోషిగా తేల్చింది. ఆయనపై మోపిన అభియోగాలు అన్నీ నిజమేనని నిర్ధారించింది. గతేడాది మార్చి 14న రాత్రి ఢిల్లీలోని తుగ్లక్ క్రెసెంట్ వద్ద ఉన్న ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది.
మంటలను ఆర్పడానికి వెళ్లిన సిబ్బందికి.. ఇంటిలోని స్టోర్‌రూమ్‌లో కాలిపోయిన రూ. 500 కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. ఈ ఘటనపై పెద్ద దుమారం చెలరేగడంతో కరెన్సీ నోట్ల కట్టలు ఎక్కడివనే దానిపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేకంగా ఒక పార్లమెంటరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల విచారణను పూర్తి చేసిన కమిటీ.. బుధవారం పార్లమెంట్‌లో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక మాజీ జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా తేల్చింది.
ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరిది? అనే విషయాలపై మాజీ జడ్జి యశ్వంత్ వర్మ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఎవరో తనపై కుట్ర చేసి ఆ డబ్బును అక్కడ పెట్టారని ఆయన వాదించారు. అయితే, తన వాదనను నిరూపించడానికి తగిన సాక్ష్యాలను ఆయన చూపించలేకపోయారు. వర్మ ఇచ్చిన వివరణలు ఎక్కడా నమ్మశక్యంగా లేవని, ఆయన సమాధానాల్లో స్పష్టత లేదని ప్యానెల్ తన రిపోర్టులో స్పష్టం చేసింది.
సాక్ష్యాలను భద్రపరచడంలో ఫెయిల్
ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను భద్రపరచడంలో తీవ్ర వైఫల్యం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత స్టోర్‌రూమ్‌లోని కరెన్సీ నోట్లు మాయం కావడం, ఆ తర్వాత వాటి ఆచూకీ లభించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
విచారణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడంలోనూ వర్మ విఫలమయ్యారని కమిటీ తన నివేదికలో తేల్చింది. నోట్ల కట్టల లెక్క కూడా తేలలేదని.. సమాధానాలు దాటవేయడం, తప్పించుకోవాలని చూడటం కారణాలతో యశ్వంత్ వర్మను లోక్‌సభ ప్యానెల్ దోషిగా తేల్చింది. వర్మ దోషిగా తేలిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
