- ప్రతిపక్షాల నిరసనల నడుమే గనులు, ఖనిజాల బిల్లు పాస్
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న ‘విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు - 2026’ (ఎఫ్‌సీఆర్‌ఏ) ను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని నిర్ణయించింది.
ప్రతిపక్ష ఎంపీల తీవ్ర నిరసనలు, ఆందోళనల మధ్య ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని బుధవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, వాయిస్ ఓట్‌తో ఆమోదం లభించింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాల నిరసనలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘‘మీ ఆలోచనలు, సిద్ధాంతాలు అధికార పక్షంతో విభేదించినప్పటికీ.. సభ సజావుగా సాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఆందోళనలు, నినాదాలతో సభా ప్రతిష్టను దిగజార్చడం సరికాదు’’ అని ప్రతిక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించకపోవడంతో ఉదయం 3 నిమిషాల్లోనే ప్రశ్నల సమయం ముగిసిపోయి, సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి.
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఇది మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు గనులు, ఖనిజాల బిల్లును ప్రతిపక్షాల నిరసనల నడుమే ఎలాంటి చర్చ లేకుండా సభ ఆమోదించింది. జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనల అంశాన్ని అధికార పక్షం లేవనెత్తడం, ప్రతిపక్షాల నినాదాలు కొనసాగడంతో సభను గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
సభలో తీవ్ర వాగ్వాదం.. అఖిలేశ్ వర్సెస్ రిజిజు
బిల్లును జేపీసీకి పంపే ముందు సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సభా ప్రాంగణం వేదికగా తీవ్ర స్థాయి వాగ్వాదం చోటుచేసుకున్నది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు మైనార్టీలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి చెబుతున్నారు
. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏ ఒక్క బిల్లు అయినా మైనార్టీలకు అనుకూలంగా ఉందా?’’ అని నిలదీశారు. అఖిలేశ్ వ్యాఖ్యలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అంతే ఘాటుగా సమాధానమిచ్చారు.
‘‘ఈ బిల్లులో ఏ ఒక్క నిబంధన అయినా మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నట్టు అఖిలేశ్ యాదవ్ నిరూపించగలరా? అని సవాల్ విసురుతున్నా’’ అని ధ్వజమెత్తారు. ప్రజలను, సభను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, విదేశీ నిధుల ప్రవాహానికి పక్కా చట్టబద్ధమైన నిబంధనలు లేకపోతే దేశ భద్రతకే ముప్పని స్పష్టం చేశారు.
బిల్లును వాపస్ తీస్కోవాలని కాంగ్రెస్ డిమాండ్
ఈ సవరణ చట్టం పూర్తిగా మైనార్టీలు, స్వచ్ఛంద సంస్థలను (ఎన్జీవోలను) లక్ష్యంగా చేసుకుని తెచ్చిందేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన రిజిజు.. ఈ బిల్లుపై వివరణాత్మక చర్చ కోసమే జేపీసీకి పంపుతున్నామని, స్వయంగా ప్రతిపక్షాలే జేపీసీకి పంపాలని కోరాయన్న విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు ఈ సవరణలపై అమెరికా కాంగ్రెస్‌మన్ రైలీ మోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
31 మందితో జేపీసీ ఏర్పాటు
ప్రతిపాదిత జేపీసీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి మొత్తం 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ సభ్యులను స్పీకర్, రాజ్యసభ సభ్యులను రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేస్తారు. ఈ కమిటీ ఈ చట్ట సవరణలోని ప్రతి నిబంధనను క్షుణ్నంగా పరిశీలించి, 2026 శీతాకాల సమావేశాల తొలి వారం చివరినాటికి సమగ్ర నివేదికను పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
