హైదరాబాద్ అబిడ్స్ లో సినీ నిర్మాత కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై కారు ఎక్కించాడు డ్రైవర్. బుధవారం ( ఆగస్టు 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... అబిడ్స్ లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై కారు ఎక్కించాడు సినీ నిర్మాత బొమ్మకు మురళి డ్రైవర్ మహానంద. ఈ ఘటనలో నాంపల్లి ఆండాళమ్మ బస్తీకి చెందిన సునీతకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది.
గన్ ఫౌండ్రి ఎస్బీఐ బ్యాంకులో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్న సునీత డ్యూటీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా చాపెల్ రోడ్డులో జరిగింది ఈ ప్రమాదం. కారు వేగంగా వచ్చి బాధితురాలి కాలు మీద ఎక్కడంతో ఆమె కాలు ఫ్రాక్చర్ అయ్యింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కారు యజమాని బొమ్మకు మురళికి ఫోన్ చేసి ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వాలని అడిగారు సునీత కుటుంబసభ్యులు. కారు తనదే అని ,తాను డబ్బులు ఇవ్వనంటూ ... యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ను చంపుకోండి అని దురుసుగా సమాధానం ఇచ్చాడు యజమాని బొమ్మకు మురళి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సునీత కుటుంబసభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సిటీలో పాదచారులు నడవటానికి ఫుట్ పాత్ లు సక్రమంగా లేవని... రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు స్థానికులు. ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించి పాదచారులు నడిచేందుకు వీలుగా తయారు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
