హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో అడ్మిషన్లకు సంబంధించి తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 465 సీట్లున్నాయి. వీటి కోసం 433 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 357 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, ఫీజు రసీదుతో పాటు జాయినింగ్ రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవాలని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ డి. షర్మిల సూచించారు. అభ్యర్థులు ఈ నెల13, 14 తేదీల్లో తమకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
అభ్యర్థులు తమ ఫీజు రసీదు, జాయినింగ్ రిపోర్టుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఫిజికల్ వెరిఫికేషన్ కోసం కాలేజీల్లో అందజేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల తనిఖీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తర్వాతే కాలేజీలోనే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను జారీ చేస్తారని కన్వీనర్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయని వారి సీట్లు రద్దవుతాయని పేర్కొన్నారు.
