'విద్య' మిల్లులో 2.89 లక్షల బస్తాల వడ్లు మాయం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారుల తనిఖీలు

'విద్య' మిల్లులో 2.89 లక్షల బస్తాల వడ్లు మాయం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారుల తనిఖీలు
  •     మొత్తం విలువ రూ. 33.60 కోట్లు ఉంటుందని అంచనా
  •     యాదాద్రి జిల్లా తుమ్మలగూడెంలోని మిల్లులో ఆఫీసర్ల తనిఖీ

యాదాద్రి, వెలుగు : సీఎంఆర్ దారి మళ్లింపులో మిల్లర్ల అక్రమాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు డిఫాల్టర్లుగా మారగా.. తాజాగా మరో మిల్లర్ రూ. 33.60 కోట్ల విలువైన 2.89 లక్షల బస్తాలను మాయం చేసినట్లు తేలింది. 

వివరాల్లోకి వెళ్తే... ఇటీవల సీజ్​అయిన యాదాద్రి రైస్​ మిల్ పార్టనర్ రామ్మోహన్​రామన్నపేట మండలం తుమ్మల గూడెంలో విద్య ఆగ్రో మిల్లు నిర్వహిస్తున్నారు. ఈ మిల్లుకు గత మూడు సీజన్లలో 34,112 టన్నుల వడ్లను అప్పగించారు. సీజన్లు గడుస్తున్నా సీఎంఆర్​అప్పగించకపోవడం, ఆయన పార్టనర్​గా ఉన్న యాదాద్రి మిల్లులో అక్రమాలు బయటపడడంతో విద్య రైస్ మిల్లుపైనా అనుమానం కలిగింది. 

దీంతో రంగంలోకి దిగిన స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం విద్య మిల్లులో తనిఖీలు చేపట్టారు. 10 మంది సభ్యులు మంగళవారం ఉదయం నుంచి లెక్కింపు ప్రారంభించారు. మొదటి సారి లెక్కింపులో భారీ స్థాయిలో తేడా రావడంతో రెండోసారి లెక్కింపు చేపట్టారు. చివరకు రూ.33,60,86,000 విలువైన 2,89,430 బస్తాలు (11,577 టన్నులు) మాయం అయినట్లు తేలింది. 

సంబంధింత రిపోర్ట్ ను ఉన్నతాధికారులకు పంపించారు. మొత్తం డబ్బును చెల్లించాలని మిల్లర్​రామ్మోహన్, పార్టనర్​ కృష్ణమూర్తికి నోటీసులు ఇస్తామని జిల్లా సివిల్​సప్లై ఆఫీసర్లు తెలిపారు. డబ్బులు చెల్లించకపోతే కేసు నమోదు చేయడంతో పాటు ఆర్​ఆర్​యాక్ట్​ ప్రయోగిస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్​నమోదు చేస్తామని హెచ్చరించారు. 

వల్లభాపురంలోని జగన్మాత మిల్లులో విజిలెన్స్ సోదాలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లభాపురంలోని జగన్మాత పార్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీని బుధవారం ఆఫీసర్లు తనిఖీ చేశారు. ఈ మిల్లుకు మొత్తం 1,38,832.80 క్వింటాళ్ల ధాన్యం కేటాయించగా ఇప్పటివరకు 30,390.92 క్వింటాళ్లను ఎఫ్ సీఐకి అప్పగించారు.

 మిల్లులో ఇంకా 1,08,441.88 క్వింటాళ్ల నిల్వ ఉండాల్సి ఉండగా 90,185.08 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. 18,256.80 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఆఫీసర్లు.. ఈ ధాన్యం విలువ సుమారు రూ. 5.30 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. ఈ డబ్బులను మూడు రోజుల్లోగా చెల్లించాలని మిల్లర్ ను ఆదేశించారు.