భార్యాభర్తలను చంపి పాతిపెట్టారు..సూర్యాపేట జిల్లా మోతేలో ఘటన

భార్యాభర్తలను చంపి పాతిపెట్టారు..సూర్యాపేట జిల్లా మోతేలో ఘటన

మోతే (మునగాల), వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా గ్రామ శివారులో పాతిపెట్టారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... మోతే మండల కేంద్రానికి చెందిన రైతులు బుధవారం ఉదయం గ్రామ శివారులోకి వెళ్లగా.. ఓ చోట చెప్పులు, గాజులతో పాటు మట్టిని తొలగించి పాతిపెట్టిన ఆనవాళ్లు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మట్టిని తొలగించి చూడగా ఇద్దరి డెడ్ బాడీలు కనిపించాయి. వాటిని బయటకు తీయగా.. దంపతులు హలావత్ నాగు (50), బూబా (40)గా గుర్తించారు. బీక్యాతండాకు చెందిన నాగు, బూబా ఇద్దరు కూతుళ్లకు పెండ్లిళ్లు చేసిన అనంతరం మోతే మండల కేంద్రంలో ఉంటూ భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. 

గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై దాడి చేసి తలపై కొట్టి హత్య చేసిన అనంతరం డెడ్ బాడీలను ఊరి బయట పాతి పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ నర్సింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మునగాల సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.