నల్గొండ జిల్లాలో విషాద ఘటన.. మగబిడ్డ పుట్టిన వారానికే బాలింత చచ్చిపోయింది !

నల్గొండ జిల్లాలో విషాద ఘటన.. మగబిడ్డ పుట్టిన వారానికే బాలింత చచ్చిపోయింది !
  • ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని మృతి
  • అనారోగ్యం, మనస్తాపమే కారణం?

నల్గొండ, వెలుగు: మూడు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టగా.. నాలుగో కాన్పులో మగబిడ్డ పుట్టిన ఆనందం వారం రోజులు కూడా నిలవకుండానే ఓ బాలింత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌‌‌‌ ఆస్పత్రిలో జరిగింది.

మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత(27) వారం రోజుల క్రితం నల్గొండ ప్రభుత్వ జనరల్‌‌‌‌ ఆస్పత్రిలో నాలుగో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు అప్పటికే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌‌‌‌ కావాల్సి ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.

ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వార్డు నుంచి బయటకు వచ్చిన మమత.. ఆస్పత్రి ఆవరణలో వాటర్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌ స్టాండ్‌‌‌‌ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాలుగైదు రోజులుగా మమత అనారోగ్యంతో బాధపడుతోంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మానసికంగా కుంగిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఓ వైపు తల్లి పాల కోసం పసికందు ఏడుస్తుండగా.. కన్నతల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన అక్కడివారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.