నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కరువు తీరి, రైతులందరికీ సమృద్ధిగా సాగునీరు అందాలనే సదుద్దేశంతోనే భక్తిశ్రద్ధలతో వరుణయాగం నిర్వహిస్తున్నామని, కొంతమందిలా క్షుద్రపూజలు చేయడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్‌లో నిర్వహించిన వరుణయాగంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి యాగం చేసినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. తాము మాత్రం నాగార్జునసాగర్ జలాశయం నిండి, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరందాలని మనస్ఫూర్తిగా వరుణదేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
