తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15శాతం కోత : సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15శాతం కోత : సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు:   తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15శాతం కోత  తప్పదని, వయోవృద్ధులను గౌరవించి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈనెల 24 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్న వారోత్సవాల  వాల్​పోస్టర్​ను గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపకుండా ఇంట్లోనే ప్రేమగా చూసుకోవాలని, ఒకవేళ వారిని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ చట్టం ప్రకారం పిల్లల స్థూల వేతనం నుంచి నేరుగా 15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 వేల వరకు కోత విధించి తల్లిదండ్రుల ఖాతాకు జమ చేయనున్నట్లు తెలిపారు. 

సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా టోల్‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్ 14567 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు సీతారామయ్య, జి.విద్యాసాగర్, ఎస్డీ హమీద్ ఖాన్, ఇరిగే కోటేశ్వరి, గజ్జల కృష్ణారెడ్డి, వినోద్ కుమార్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. 

యాదాద్రి  :  వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం,  బాధ్యతతో వ్యవహరించాలని డీఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏ మాధవీలత, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో వృద్ధుల హక్కులు, రక్షణపై అవగాహన కల్పించే ప్రదర్శన బోర్డులను ప్రారంభించడంతో పాటు, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 సవరణ నియమాలు, సంక్షేమానికి సంబంధించిన పుస్తకాలను వారు విడుదల చేశారు. ఈ వారోత్సవాల ద్వారా వృద్ధుల ఆరోగ్యం, భద్రత, సామాజిక గౌరవం, కుటుంబ బాధ్యతలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు.