- బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
- ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్
సూర్యాపేట, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అర్నాబ్ తుఫాన్‌గా మారడంతో గురువారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా కావడం, ఐఎమ్‌డీ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం కలెక్టర్ సెలవు ప్రకటించారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు పనిచేసే అత్యవసర కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎస్పీతో కలిసి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రాబోయే 24 గంటల పాటు పరిస్థితులను తీవ్రంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లను అందుబాటులో ఉంచారు. మట్టంపల్లి వద్ద రహదారిపై కూలిన చెట్టును ఫైర్ సిబ్బంది తక్షణమే తొలగించారు.
అలుగు పోస్తున్న చెరువులు
తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. తుంగతుర్తిలోని వెలుగుపల్లి రోడ్డు పెద్ద చెరువు అలుగు పోస్తుండటంతో తహసీల్దార్ దయానందంతో కలిసి ఆర్డీవో వేణు మాధవరావు పరిశీలించారు. గరిడేపల్లి మండలంలోని తాళ్ల మల్కాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి భారీ ప్రవాహానికి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
మూసీ రిజర్వాయర్‌కు వరద..
ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను ప్రస్తుతం 640.58 అడుగులకు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,150 క్యూసెక్కుల వరద రిజర్వాయర్‌లోకి చేరిందని, రానున్న గంటల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పరిస్థితులను బట్టి గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశముందని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ ఈఈ డి.యాదగిరి హెచ్చరించారు.
