ప్రణయ్‌‌ హత్య కేసులో ఖైదీ అబ్దుల్‌‌ బారీ ప్రాణాలు కోల్పోయాడు..

ప్రణయ్‌‌ హత్య కేసులో ఖైదీ అబ్దుల్‌‌ బారీ ప్రాణాలు కోల్పోయాడు..
  • చంచల్గూడ జైలులో గుండెనొప్పి..
  • చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో నాలుగో నిందితుడు అబ్దుల్  బారీ మృతిచెందాడు. చర్లపల్లి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న బారీ.. గత నాలుగేండ్లుగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ మేరకు గత రెండేండ్లుగా గాంధీ హాస్పిటల్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. 

గురువారం ఉదయం గుండెనొప్పి రావడంతో జైలు సిబ్బంది ఆయనను  గాంధీ హాస్పిటల్‌‌కు తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటలకు మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కూతురు అమృత తన ప్రియుడు ప్రణయ్‌‌తో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రేమపెళ్లి ఇష్టం లేని తండ్రి మారుతీరావు.. 2018 సెప్టెంబర్‌‌‌‌ 14న ప్రణయ్‌‌ను హత్య చేయించాడు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు ప్రధాన నిందితుడు కాగా, నల్లగొండ ప్యారసభాగ్ కాలనీకి చెందిన అబ్దుల్ బారీ నాలుగో నిందితుడిగా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. గుజరాత్‌‌ మాజీ హోంమంత్రి హరేన్ పాండే హత్య కేసులోనూ అబ్దుల్‌‌ బారీ నిందితుడిగా ఉన్నాడు. కోర్టు విచారణలో నిర్దోషిగా బయటపడ్డాడు. 

కాగా, ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు, అబ్దుల్‌‌ బారీ, సుపారీ కిల్లర్లు అస్గర్ అలీ, సుభాష్‌‌ శర్మ సహా మొత్తం 8 మందిపై మిర్యాలగూడ పోలీసులు 2019 జూన్ 12న నల్లగొండ జిల్లా కోర్టులో చార్జిషీట్‌‌ దాఖలు చేశారు. అదే ఏడాది ఏప్రిల్‌‌ 28న మారుతీరావు బెయిల్‌‌పై విడుదల అయ్యారు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలోనే 2020 మార్చి 8న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆ తర్వాత 2025 మార్చి10న నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు తీర్పువెల్లడించింది. సుపారీ కిల్లర్‌‌‌‌ సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించడంతో పాటు మారుతీరావు మృతిచెందడంతో  అబ్దుల్‌‌ బారీతో పాటు ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి అబ్దుల్‌‌ బారీ చంచల్‌‌గూడ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.