కూసుమంచి, వెలుగు: పాలేరు జలాశయానికి సాగర్ నుంచి నీటి విడుదల లేకపోతే సాగుకు నీటి విడుదల చేయడం కష్టమేనని ఐబీ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన పాలేరు జలాశయాన్ని పరిశీలించారు.
సాగర్ ఇన్‌ఫ్లో కాలువ, రంగుల బ్రిడ్జి, పెద్ద కాలువ, పాత కాలువ గేట్లను పరిశీలించారు. ప్రస్తుతం జలాశయంలో 17.90 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉందని, ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు పొదుపుగా వినియోగిస్తామని తెలిపారు.
సాగర్ నుంచి నీటి విడుదల జరిగితే జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపి, ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగునీటిని విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం నీటిని భద్రపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈ తెలిపారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఈఈ బాబూరావు, జేఈలు శ్రీరామ్, శ్రీనివాస్, మీనా, సిబ్బంది ఉన్నారు.
