రాజన్న ఆలయ గర్భాలయం, మహామండపానికి మార్పుల్లేవు

రాజన్న ఆలయ గర్భాలయం, మహామండపానికి మార్పుల్లేవు
  •     శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్, అధికారులు, అర్చకులు

హైదరాబాద్, వెలుగు: దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధిపై వస్తున్న అపోహలను భక్తులు నమ్మొద్దని కోరారు. ఆలయ అభివృద్ధి వివరాలను శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి స్వామికి వివరించేందుకు ఆది శ్రీనివాస్ బుధవారం అధికారులు, అర్చకులతో కలిసి శృంగేరికి వెళ్లారు. 

ఇప్పటివరకు జరిగిన పనులు, ఆలయ నమూనాలను పీఠాధిపతికి చూపించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించారని ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లతో పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా గర్భాలయం, మహామండపంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకబోమని చెప్పారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 1973లో నిర్మించిన ప్రస్తుత శిఖరం స్థానంలో భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయంగా శిఖరాన్ని పెంచే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నామని తెలిపారు. 

దేవాదాయ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు భక్తులకు దూరం నుంచే శిఖర దర్శనం కలిగేలా నాలుగు అడుగుల మేర శిఖరాన్ని శిలామయంగా నిర్మించాలని సూచించినట్లు చెప్పారు. త్వరలోనే పీఠం నుంచి శ్రీముఖం అందుతుందని తెలిపారు. ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ, స్థానాచార్యులు ఉమేష్ శర్మ మాట్లాడుతూ.. గర్భాలయం, మహామండపానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాస్, ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, వేములవాడ టెంపుల్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) వైస్ చైర్మన్ గరిమ అగర్వాల్, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.