అమావాస్య రోజున ఊరి చివర బండరాయికి తాళిబొట్టు కలకలం!

అమావాస్య రోజున ఊరి చివర బండరాయికి తాళిబొట్టు కలకలం!

హర్రర్ సినిమాను తలపించేలా.. అమావాస్య రోజు బండరాయికి తాళిబొట్టు కట్టి ఉండటం కలకలం రేపింది. బండరాయికి తాళి బొట్టు ఉండటమేంటి.. క్షుద్రపూజలు చేశారా ఏంటి..? అది కూడా అమావాస్య రోజు ఇలాంటి ఘటనలేంటని.. స్థానికులు భయాందోళనలకు గురయిన పరిస్థితి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుమున్నూరు గ్రామపంచాయతీ శివారులో 2026 ఆగస్టు 12 అర్ధరాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

 స్థానిక సర్పంచ్ చెరుకు తోట సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మనూరు గ్రామం నుంచి తోట గోపయ్య పల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో ఓ బండరాయికి పుస్తెలతాడు వేసి ఉన్నట్లు  స్థానిక మహిళలు ద్వారా  తెలిసినట్లు  పేర్కొన్నారు. కొంతమందితో కలిసి   ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా పుస్తెలతాడు బండరాయికి తగిలించి ఉందని అన్నారు. ఈ ప్రాంతం గతంలో క్షుద్ర పూజలు జరిగే ప్రదేశమని సర్పంచ్ తెలిపారు. 

ఈ విషయం పరిసర గ్రామాల్లో తెలవడంతో ఆందోళన వ్యక్తం అయింది. సామాజిక మాధ్యమాలలో ఈ ఫోటో వైరల్ అయింది. ఆలుమగల పవిత్ర బంధానికి నిలువెత్తు సాక్ష్యం తాళిబొట్టు ఈ విధంగా రాయికి ఉండడంపై స్థానికులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. మంథని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.