- పేషెంట్ ఫిర్యాదుతో వెలుగులోకి, క్లినిక్ సీజ్
మంచిర్యాల, వెలుగు : ఇంటర్ మాత్రమే పూర్తి చేసిన ఓ వ్యక్తి.. ఫిజియోథెరపిస్ట్ గా చలామణి అవుతూ రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో సుమారు పదేండ్లుగా జరుగుతున్న ఈ తతంగం బుధవారం వెలుగుచూసింది. టీజీఎంసీ మెంబర్ యెగ్గెన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... లక్షెట్టిపేటకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా స్టార్ ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. తనకు తానుగా డాక్టర్‌గా ప్రచారం చేసుకుంటూ రోగులను పరీక్షిస్తున్నాడు.
సుమారు పదేండ్లుగా ఫిజియోథెరపీ పేరుతో చికిత్స అందించడమే కాకుండా ఇంజెక్షన్లు, మందులు సైతం ఇస్తున్నాడు. విజయ్ కుమార్ తీరుపై అనుమానం వచ్చిన ఓ పేషెంట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయడంతో సభ్యులు విజయ్ కుమార్ క్లినిక్ ను, అతడి సర్టిఫికెట్లను తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఇంటర్ మాత్రమే చదివిన విజయ్ కుమార్.. ఫిజియోథెరపిస్ట్ గా చలామణి అవుతూ ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు టీజీఎంసీ ప్రతినిధులు, డీఎంహెచ్‌వో కలిసి బుధవారం క్లినిక్ ను సీజ్ చేశారు. కాగా, విజయ్ కుమార్ సుమారు పదేండ్లుగా, బహిరంగంగా ట్రీట్ మెంట్ చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు గుర్తించకపోవడం గమనార్హం. క్లినిక్ కు రిజిస్ట్రేషన్ ఉందా ? రెన్యూవల్ చేసుకుంటున్నాడా ? అనే విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం ఆఫీసర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
