ఆసిఫాబాద్, వెలుగు : ఓ గర్భిణికి అత్యవసర వైద్యం అవసరం పడడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు వాగు అడ్డుగా మారింది. దీంతో గిరిజనులు ప్రాణాలకు తెగించి మహిళను స్ట్రెచర్ పై మోసుకుంటూ వాగు దాటించారు.
ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో జరిగింది. దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడకు చెందిన కొడప రామేశ్వరి ఏడు నెలల గర్భిణి. అత్యవసరంగా వైద్యం చేయించాల్సి రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
కానీ గ్రామానికి సమీపంలోని వాగు ఉధృతంగా పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి మహిళను స్ట్రెచర్ పై పడుకోబెట్టి వాగు దగ్గరకు తీసుకొచ్చారు. అనంతరం తమ ప్రాణాలకు తెగించి ఉధృతంగా పారుతున్న వరద నీటిలోంచి నడుస్తూ అవతలి ఒడ్డుకు చేర్చారు.
అనంతరం కెరమెరి హాస్పిటల్ కు, అక్కడి నుంచి ఆసిఫాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ప్రభుత్వం స్పందించి కొలాంగూడ వంటి మారుమూల గూడేలకు రోడ్డు, బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
