- ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం: మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, వెలుగు : ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన బుధవారం స్థానికంగా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్, కేఎల్‌ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో, భవిష్యత్‌లో నీటి లభ్యత వివరాలను ఆఫీసర్లు మంత్రులకు వివరించారు.
]అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కర్ణాటకలో కురిసిన వర్షాలతో జూరాలకు కొంత వరద వచ్చినప్పటికీ, డిసెంబర్ వరకు సరిపడా నీరు అందాలంటే ప్రస్తుతం వర్షాలు పడడం అత్యంత అవసరం అని చెప్పారు.
రైతులు వరి సాగు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మినుములు, వేరుశనగ, ఆయిల్‌పామ్, కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం, గతంలో ఉన్న నీటి సౌకర్యం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వివరాలను సమర్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
నీటి లభ్యతపై పూర్తి సమాచారం ఇవ్వాలి : మంత్రి వాకిటి శ్రీహరి
జిల్లాలోని ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తోంది, ఎంత నీటిని విడుదల చేస్తున్నారన్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆఫీసర్లపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించాలని సూచించారు.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగునీటి అవకాశాల గురించి వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి, విజయుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్లు కుష్బూ గుప్తా, సీహెచ్.ప్రియాంక, షేక్ రిజ్వాన్ బాషా, హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొన్నారు.
