బషీర్‌బాగ్, వెలుగు: నారాయణపేట జిల్లాలోని ప్రముఖ ముడుమాల్ బృహత్‌శిలాయుగ వారసత్వ స్థలం అభివృద్ధికి, పరిరక్షణకు కృషి చేస్తానని కలెక్టర్ ప్రియాంక హామీ ఇచ్చారు. తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ శుక్రవారం కలెక్టర్‌ను కలిసి స్థల అభివృద్ధి, పరిరక్షణ, ప్రాచుర్యంపై చర్చించారు.
ముడుమాల్ స్థల సరిహద్దులను నిర్ధారించి గుర్తించడం, పరిరక్షణకు అవసరమైన భూసేకరణ చేపట్టడం, రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు బీటీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం వంటి ప్రతిపాదనలను వివరించారు. ముడుమాల్ చారిత్రక, పురావస్తు ప్రాధాన్యంపై జిల్లాలోని స్కూళ్ల హెచ్ఎంలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పర్యాటక మార్గదర్శకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ఏటా ముడుమాల్‌లో రెండు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించే అంశాలపై చర్చించారు. ప్రతిపాదనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ముడుమాల్‌ను ప్రముఖ వారసత్వ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
