అబుదాబి: ప్రాణాలకు తెగించి 180 మందిని కాపాడిన రియల్ హీరో, ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం (అక్టోబర్ 3) పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి స్మిత్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. స్మిత్‌కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ మచ్చర్ చూపిన అసమాన ధైర్యసాహసాలను యువరాజు ప్రశంసించారు.
ఆసుపత్రిలో స్మిత్ మచ్చర్‌ను కలిసిన ఫొటోలను యువరాజు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. రియల్ హీరో స్మిత్ మచ్చర్ ను చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. ‘‘కెప్టెన్ స్మిత్ మచ్చర్ అత్యున్నత స్థాయి ధైర్యాన్ని, బాధ్యతను ప్రదర్శించి మానవ ప్రాణాలను కాపాడారు. ఆయనకు మా తరపున, దేశ నాయకత్వం తరపున పూర్తి అభినందనలు. ఆయన మా ఫ్లైదుబాయ్ టీమ్‌లో భాగం కావడం.. మా దేశ కథనంలో నిలవడం యూఏఈ ప్రతిబింబించే కరుణ, శాంతి, మానవత్వ విలువలకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
బుధవారం (సెప్టెంబర్ 30) ఆకాశంలో సినీ రేంజ్లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.
విమానం ఆకాశంలో కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్‌పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్పై దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ స్మిత్ మచ్చర్ కు అబుదాబిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లెదుబాయ్ విమాన ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.
