డెలివరీ ఆలస్యమైందని..సికింద్రాబాద్ లో జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి

 డెలివరీ ఆలస్యమైందని..సికింద్రాబాద్ లో జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి

సికింద్రాబాద్: లొకేషన్ తప్పుగా చూపించడంతో డెలివరీ ఆలస్యం కావడంతో తలెత్తిన వివాదం జొమాటో డెలివరీ బాయ్‌పై దాడిచేశారు దంపతులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వాసవి నగర్‌లో ఈ ఘటన జరిగింది. 

పోలీసులు, బాధితుడి వర్గం తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిష్ అనే డెలివరీ బాయ్ ఆర్డర్‌ను తీసుకుని కస్టమర్ సూచించిన ప్రాంతానికి వెళ్లాడు. అయితే లొకేషన్ సరిగ్గా చూపించకపోవడంతో డెలివరీ కొంత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. డెలివరీ ఆలస్యం కావడంపై కస్టమర్ ఆశిష్‌తో వాగ్వాదానికి దిగిగడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.  వివాదం ముదిరిన సమయంలో కస్టమర్‌తో పాటు అతని భార్య కూడా డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. గొడవ జరుగుతున్న సమయంలో మహిళ ఆశిష్ తలపై కొట్టాడు.  ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు  కొడుతున్నాయి. 

పోలీసులపై డెలివరీ బాయ్‌ల ఆగ్రహం

ఘటనపై కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే తమపై దాడి జరిగినప్పటికీ చిన్న కేసు నమోదు చేశారంటూ పలువురు డెలివరీ బాయ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  డెలివరీ ఆలస్యం వంటి కారణాలతో తమపై దాడులు జరగడం ఆందోళనకరమని డెలివరీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఇరువర్గాల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.