Believe And Hard Work.. 2-1తో సిరీస్ గెలుపుపై గంభీర్ పోస్ట్‌తో అసలు రచ్చ స్టార్ట్!

Believe And Hard Work.. 2-1తో సిరీస్ గెలుపుపై గంభీర్ పోస్ట్‌తో అసలు రచ్చ స్టార్ట్!

Gautam Gambhir: వెస్టిండీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌ను టీమిండియా 2–1 తేడాతో కైవసం చేసుకున్నప్పటికీ, ఆఖరి మ్యాచ్‌లో ఊహించని ఓటమి ఎదురవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించారు. తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ను ముందే కైవసం చేసుకున్న భారత్.. ముల్లన్‌పూర్‌లో జరిగిన మూడో వన్డేలో 352 రన్స్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన శతకంతో చెలరేగి జట్టుకు రికార్డు విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో సిరీస్ విజయంపై, ప్రత్యర్థి పోరాటంపై గంభీర్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పోటీని తీవ్రం చేసినందుకు విండీస్‌పై ప్రశంసలు: గంభీర్
 
* సిరీస్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. నమ్మకం, కఠిన శ్రమతో గెలుచుకున్న సిరీస్ ఇది. మా అబ్బాయిల ఆట పట్ల గర్వంగా ఉంది. మన చేత తీవ్రంగా శ్రమించేలా చేసిన వెస్టిండీస్‌కు ప్రత్యేక గౌరవం అంటూ పోస్ట్ చేశారు.

* గతంలో రెండో వన్డే సందర్భంగా పిచ్‌ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన గంభీర్.. ఏకంగా 800లకు పైగా పరుగులు నమోదైన ఆ మ్యాచ్‌ను ఇది క్రికెట్టే కాదు (No cricket) అంటూ ఘాటుగా స్పందించారు. ఇక చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ, కరేబియన్ ఆటగాళ్లు పడిన కష్టాన్ని, వాళ్లు చూపిన పోరాటపటిమను గంభీర్ క్రీడాస్ఫూర్తితో ప్రశంసించడం విశేషం.

బౌలింగ్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసంతృప్తి: 

మ్యాచ్ అనంతరం భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించినప్పటికీ, బౌలింగ్‌లో ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందన్నాడు. చాలా అంశాల్లో బాక్సులు టిక్ అయ్యాయి. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం కచ్చితంగా ఫైన్-ట్యూనింగ్ అవసరం, మేము చేసిన స్కోరు చాలా గొప్పది, మ్యాచ్ మా ఆధీనంలోనే ఉందనుకున్నాం.. కానీ ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా చివరికి మ్యాచ్ మన చేజారింది. అలాగే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేటప్పుడు మనం డిఫెండ్ చేసుకుంటున్నామా లేక అటాక్ చేస్తున్నామా అనేది క్లారిటీ లేదని గిల్ చెప్పుకొచ్చాడు.