వీపనగండ్ల/కోడేరు (పెద్దకొత్తపల్లి), వెలుగు : రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని వల్లభాపూర్ శివారులో సింగోటం, గోపాల్ దీన్నె లింకు కెనాల్ కు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సుమారు రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఈ లింక్ కెనాల్ ను సంవత్సరంలోపు పూర్తి చేసి సాగునీరు అందించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులు సంబంధిత అధికారులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, పర్యాటక శాఖ అధికారి నరసింహ, వీపనగండ్ల మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి పాల్గొన్నారు.
జ్యోతిబా పూలే, మహేంద్రనాథ్ విగ్రహాల ఆవిష్కరణ
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో జ్యోతిబా పూలే, పుట్టపాక మహేంద్రనాథ్ విగ్రహాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రొఫెసర్ కాశీం, మహేంద్రనాథ్ కుమారుడు, కర్ణాటక రిటైర్డ్ డీజీపీ రవీంద్రనాథ్హాజరై నివాళులర్పించారు.
