సౌకర్యాలు కల్పిస్తం.. బాగా చదవండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

సౌకర్యాలు కల్పిస్తం.. బాగా చదవండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

లింగాల, వెలుగు: విద్యార్థుల చదువుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలో తాగునీటి సమస్యతో పాటు లైట్లు సరిగా లేవని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన మంత్రి నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌‌‌‌తో ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. సమస్యలు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్సీఓను ఆదేశించారు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న స్టూడెంట్స్​కు నీట్ కోచింగ్ అందించేందుకు ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం, ఆర్సీఓ విద్యులత, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పాల్గొన్నారు.