పానుగల్/ కొల్లాపూర్, వెలుగు: పల్లెల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, నిర్మాణాలు పూర్తయిన పలు గ్రామ పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. షాగాపూర్ తండా, నిజామాబాద్, వెంగలాయపల్లి, జమ్మాపూర్, బండపల్లి, రేమద్దుల తదితర గ్రామాల్లో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా సమైక్య భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. పానుగల్‌లో గోదాం నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. వెంగలాయపల్లిలో మహిళా సంఘంలో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, అక్కడ మెరుగైన విద్య అందుతుందని తెలిపారు.
‘తొలిముద్ద’ ప్రారంభం..
చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’ అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్లో కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా అల్పాహారం తినిపించారు. అక్టోబర్ 1 నుంచి నాగర్‌కర్నూల్‌తో పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తొలిదశలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కొల్లాపూర్‌లో రూ.2.50 కోట్లతో నిర్మించనున్న ఎస్టీ బాలుర వసతిగృహ భవనానికి శంకుస్థాపన చేశారు. ఎల్లూరులో క్రీడా మైదానం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతిరెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
