టాటా సన్స్కు చంద్రశేఖరన్ గుడ్ బై
మూడో టర్మ్ కొనసాగేందుకు నో
టాటా సన్స్ లిస్టింగ్‌పై రెండు వర్గాల మధ్య విభేదాలు
న్యూఢిల్లీ: ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి భారతదేశపు అతిపెద్ద కంపెనీ 'టాటా సన్స్' చైర్మన్‌గా ఎదిగిన నటరాజన్ చంద్రశేఖరన్ బుధవారం తన పదవికి గుడ్ బై చెప్పారు. 2017 లో చైర్మన్‌గా నియమితులైన ఆయన, ప్రస్తుతం తన రెండో టర్మ్‌ను కొనసాగిస్తున్నారు. 2027 ఫిబ్రవరి 20 తో పదవీ కాలం ముగియనుండగా,మూడో టర్మ్ కొనసాగేందుకు నిరాకరించారు.
టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాతో వచ్చిన విభేదాల వల్లనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో మాజీ చైర్మన్ రతన్ టాటా మరణం తర్వాత గ్రూప్ అగ్రనాయకత్వంలో ఆధిపత్య పోరు మొదలైంది. రతన్ టాటాకు అత్యంత నమ్మకస్తులైన వ్యక్తులు విజయ్ సింగ్, మెహ్లీ మిస్త్రీలు ఇప్పటికే టాటా గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోగా, చంద్రశేఖరన్ కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
గొడవులు మొదలైంది ఇలా
ఉప్పు నుంచి సెమీకండక్టర్ల వరకు వందలాది వ్యాపారాలను నియంత్రించే టాటా సన్స్ కంపెనీలో 'టాటా ట్రస్ట్స్'కు 66శాతం వాటా ఉంది. ఇందులో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (27.98శాతం), సర్ రతన్ టాటా ట్రస్ట్ (23.56శాతం) అతిపెద్ద వాటాదారులు. 2024 అక్టోబర్‌లో నోయెల్ టాటా, టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి బోర్డు నియామకాలు, నిర్ణయాలలో విభేదాలు బయటపడ్డాయి.
ఒకవైపు నోయెల్ టాటా వర్గం, మరోవైపు మెహ్లీ మిస్త్రీ, ప్రమిత్ జవేరి, దరియస్ ఖంబాటాతో కూడిన వర్గం మధ్య గొడవ నెలకొంది. వీరి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్‌ను భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయాలా వద్దా అన్నదే ప్రధాన విభేదం.
నోయెల్ టాటా లిస్టింగ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లు లిస్టింగ్‌కు మద్దతు తెలిపారు. చంద్రశేఖరన్ కూడా లిస్టింగ్‌ను పూర్తిగా తోసిపుచ్చకపోవడంతో, ఆయనకు నోయెల్ టాటాకు మధ్య విభేదాలు నెలకొన్నాయి.
ఒక్క డైరెక్టర్ ఒప్పుకోకపోవడంతో..
చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని దొరాబ్జీ, రతన్ టాటా ట్రస్ట్‌లు ఏకగ్రీవంగా సిఫార్సు చేసినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక డైరెక్టర్ మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపాదన ఆగిపోయింది.
ఆరు నెలలు గడిచినా పరిష్కారం లభించకపోవడంతో, కంపెనీ వ్యూహాత్మక ప్రాజెక్టులకు, ఇన్వెస్టర్లకు నాయకత్వ స్పష్టత అవసరమని భావించి, ఫిబ్రవరి 2027 తర్వాత తాను చైర్మన్‌గా కొనసాగనని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. కొత్త వారసుడిని ఎంపిక చేయాల్సిందిగా
బోర్డును కోరారు.
'చంద్ర' ప్రస్థానం..
2017లో సైరస్ మిస్త్రీ వివాదం తర్వాత టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టారు. సంస్థలో పార్సీ మతం కాని మొదటి చైర్మన్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ రాబడి రెట్టింపై 180 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.17.28 లక్షల కోట్ల) ను దాటగా, నికర లాభం మూడు రెట్లు పెరిగింది. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 26 లక్షల కోట్లకు చేరింది.
ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసి విమానయాన రంగాన్ని విస్తరించడంతో పాటు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ వ్యాపారాలు, బ్యాటరీ రంగాల్లోకి గ్రూప్‌ను నడిపించారు. టాటా కాఫీ, టిన్‌ప్లేట్ వంటి చిన్న కంపెనీలను పెద్ద సంస్థలలో విలీనం చేసి, గ్రూప్‌ను మేనేజ్ చేయడాన్ని సులభం చేశారు.
టాటా షేర్లు ఢమాల్
చంద్రశేఖరన్ రాజీనామా వార్తలతో టాటా గ్రూప్ షేర్లు బుధవారం పడ్డాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ దాదాపు 4 శాతం పడిపోవడంతో గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ. 45,615 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. టీసీఎస్ అత్యధికంగా 3.71శాతం నష్టపోగా, ఈ ఒక్క షేరులోనే రూ. 32,743 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
టాటా కన్స్యూమర్ (2.44శాతం), టాటా ఎలక్సీ (2.23శాతం), టాటా మోటార్స్ (1.92శాతం), టాటా స్టీల్ (1.57శాతం) నష్టాల్లో ముగిశాయి. టైటాన్, టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్ కూడా క్షీణించాయి. నాయకత్వ మార్పుపై అనిశ్చితి వలనే టాటా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
