వానొస్తే రాకపోకలు బంద్.. బ్రిడ్జిలు లేని వాగులు.. బురద రోడ్లు.. ఆదిలాబాద్ ఏజెన్సీలో గిరిజనుల కష్టాలు

వానొస్తే రాకపోకలు బంద్.. బ్రిడ్జిలు లేని వాగులు.. బురద రోడ్లు.. ఆదిలాబాద్ ఏజెన్సీలో గిరిజనుల కష్టాలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జిలు లేకపోవడంతో వాగులు ఉప్పొంగినప్పుడల్లా రవాణా స్తంభించి రోజుల తరబడి గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు.

అత్యవసర సమయంలో వాగులు దాటేందుకు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. చాలా గ్రామాల్లో సరైన రోడ్లు లేక కిలోమీటర్ల మేర బురదలోనే ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. వానాకాలానికి ముందే రోడ్ల నిర్మాణం, రిపేర్లు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ కష్టాలు పడుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గిరిజనులు తమగోడు వెలిబుచ్చుకుంటున్నారు.

వాగులు పొంగితే రాకపోకలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, భీంపూర్, సిరికొండ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్ తాంసీ, తలమడుగు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. కొన్ని మండలాల్లో లోలెవల్ బ్రిడ్జిలతో సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిరికొండ మండలం నుంచి రాంపూర్ గ్రామానికి మధ్య ఉన్న చిక్ మాన్ వాగుపై ఉన్న బ్రిడ్జి చిన్నపాటి వరదకే మునిగిపోయి రాంపూర్, ఇంద్రవెల్లి మండలంలోని సాలెవాడ, గౌరపూర్, ధనోరా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఇంద్రవెల్లి మండలంలోని సట్వాజిగూడ గ్రామ సమీపంలోని వాగుపై ఉన్న వంతెనపై నుంచి ప్రతి ఏటా వచ్చే వరద ప్రవాహంతో 40 గ్రామాల రాకపోకలు నిలిచిపోతాయి.

అత్యవసర సమయాల్లో తప్పని తిప్పలు
ఏటా వానాకాలంలో అత్యవసర సమయాల్లో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలంటే గిరిజనులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా గర్భిణులు వాగులు దాటలేక, బురద రోడ్లపై నడవలేక పరిస్థితి విషమిస్తోంది. అంబులెన్స్ వచ్చే వరకు ఎదురుచూసినప్పటికీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో గతంలో వాగుల ఒడ్డునే ప్రసవాలు జరిగిన సందర్భాలు ఉండగా, వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.

పత్తాలేని ఐటీడీఏ పాలక వర్గాలు..
గిరిజనులు, ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు ఎంతో కీలకం.  ఈ సమావేశాలు గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉపాధి, విద్య, వైద్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సమస్యలపై చర్చిస్తారు. ఏడేండ్లుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు జరగడంలేదు. దీంతో రోడ్లు, తాగునీరు, ఇతర గ్రామ సమస్యలపై అధికారులు చుట్టూ గిరిజనుల చక్కర్లు కొడుతున్నారే తప్ప వాటికి పరిష్కారం మాత్రం దొరకడం లేదు.

నేరడిగొండ మండలం సేవాదాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామ సమీపంలోని వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో కుమారి గ్రామం మీదుగా గాజిలికి రాకపోకలు నిలిచి ఏజెన్సీవాసులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో ప్రమాదకరంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుదాటుతుంటారు. సరైన రోడ్డు కూడా లేకపోవడంతో బురదలోనే ప్రయాణించాల్సి వస్తుంది.
 
* బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హత్నూర్ మండలం మొర్కండి వాగు వద్ద బ్రిడ్జి లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రాకపోకలు నిలిచిపోతున్నాయి. బ్రిడ్జి మంజూరయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించలేదు. దీంతో ఈవాగుపై ఉన్న లోలెవల్ కల్వర్టు వరద ప్రవాహానికి మునిగిపోయి ప్రమాదకరంగా మారుతుంది.

* గుడిహత్నూర్ మండలం ఉమ్రి నుంచి సోయంగూడ గ్రామాల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వరద వచ్చినప్పుడు సోయంగూడ, ధనోర, తోషంతాండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.  తోషం నుంచి తెలంగ్ రావ్ గూడకు వెళ్లే దారిలో బ్రిడ్జి కింద కుంగిపోయి ప్రమాదకరంగా మారింది.

* భీంపూర్ మండలం గుబిడి, టేకిడిరాంపూర్, గుబిడిపల్లి, తదితర గ్రామాలకు మట్టిరోడ్లే దిక్కు. చిన్నపాటి వర్షానికే ఈ గ్రామానికి వెళ్లే రోడ్లు బురదమయమవుతున్నాయి. కిలోమీటర్ల మేర బురదలో నడిచివెళ్లాల్సిన పరిస్థితి.