- నెలకు రూ.88 కోట్ల నిధి జమ
- సెప్టెంబర్ 1 నుంచి పోలీసులకూ వర్తింపు
- త్వరలో మరో 25 వెల్‌నెస్ కేంద్రాలు
- హెల్త్‌కార్డు లేకున్నా ఐడీతో చికిత్స
- 30 సూపర్ స్పెషాలిటీల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమలవుతున్న నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఎన్‌ఈహెచ్‌ఎస్) కింద ఇప్పటివరకు 15,395 చికిత్సలకు గాను రూ.104.63 కోట్ల విలువైన ముందస్తు అనుమతులు (ప్రీ-ఆథరైజేషన్లు) ప్రభుత్వం మంజూరు చేసింది. జులై 17న ప్రారంభమైన ఈ పథకం పరిధిలోకి 778 ప్రైవేటు, 141 సర్కారు దవాఖానలతో కలిపి మొత్తం 919 ఆస్పత్రులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన నివేదికలో వెల్లడించింది.
ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పథకానికి నెలకు రూ.88 కోట్ల నిధి జమ అవుతోందని, సెప్టెంబర్ 1 నుంచి పోలీసు శాఖను కూడా ఈ పరిధిలోకి చేర్చినట్లు పేర్కొంది. డిజిటల్ హెల్త్ కార్డు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోకపోయినా ఎంప్లాయ్ ఐడీ లేదా పీపీవో నంబర్ ఆధారంగా వైద్య సేవలు పొందవచ్చని పేర్కొంది. అలాగే ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో రోగులకు అడ్మిషన్లు, సేవల సమన్వయంలో ఇబ్బందులు తలెత్తకుండా 30 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తన నివేదికలో స్పష్టం చేసింది.
డిజిటల్ హెల్త్‌కార్డు చేతికి అందలేదన్న కారణంతో అర్హులకు వైద్య సేవలను నిరాకరించవద్దని, గుర్తింపు కార్డు సంఖ్య ఆధారంగా సేవలు అందించాలని ఆదేశించింది. సెప్టెంబర్ 28 నాటికి పోర్టల్‌లో 12,56,962 కార్డులు అందుబాటులోకి రాగా.. 7,56,210 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన పాత ఈహెచ్‌ఎస్ బకాయిల్లో రూ.70 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
ఇంకా రూ.100.52 కోట్ల బకాయిలు ఉండగా.. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.23.85 కోట్లు, సర్కారు దవాఖానలకు రూ.76.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రైవేటుకు ఇవ్వాల్సిన నిధుల్లో రూ.19.23 కోట్ల విలువైన చెక్కులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో రోగులకు రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు సహకారం అందించేందుకు 30 కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు సేవలందిస్తున్నాయి.
ప్రతి నెలా రూ.88 కోట్ల ప్రత్యేక నిధి
ఈ పథకం నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శాశ్వత నిధిని ఏర్పాటు చేసి పకడ్బందీగా నిధుల సమీకరణ చేపడుతోంది. ఉద్యోగులు, పింఛనుదారుల బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెలా 1.5 శాతం మొత్తాన్ని ఆరోగ్య నిధికి జమ చేస్తున్నారు. అంతే సమానమైన 1.5 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్ గ్రాంట్‌గా ట్రస్ట్‌కు విడుదల చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్ల వాటా కింద నెలకు రూ.44 కోట్లు సమకూరుతుండగా, ప్రభుత్వం అందించే మరో రూ.44 కోట్లతో కలిపి ప్రతి నెలా రూ.88 కోట్ల ప్రత్యేక నిధి ట్రస్ట్ ఖాతాకు నేరుగా చేరుతోంది.
ఈ విధానం ద్వారా పథకం వార్షిక బడ్జెట్‌ను రూ.1,056 కోట్లుగా ఆర్థిక శాఖ నిర్ధారించింది. నెట్‌వర్క్ ఆస్పత్రుల క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే మూడు నెలలకు సంబంధించిన రూ.264 కోట్ల నిధులను ట్రస్ట్‌కు ముందస్తుగానే బదిలీ చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు 3,192 చికిత్స కేసులకు రూ.18.75 కోట్ల ముందస్తు అనుమతులు ఇవ్వగా.. వారి కుటుంబ సభ్యులకు చెందిన 5,669 కేసులకు రూ.39.52 కోట్లు మంజూరు చేశారు.
అలాగే పింఛనుదారుల విభాగంలో 4,042 కేసులకు రూ.29.27 కోట్ల విలువైన వైద్య సేవలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. పింఛనుదారుల కుటుంబ సభ్యులకు సంబంధించి 2,492 కేసుల్లో రూ.17.08 కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఆమోదించారు. మొత్తం 15,395 కేసుల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యుల విభాగంలోనే అత్యధికంగా రూ.39.52 కోట్ల మేర వైద్య సేవల ప్రీ-ఆథరైజేషన్లు నమోదయ్యాయి.
మరో 25 వెల్‌నెస్ కేంద్రాలు
ఉద్యోగుల కంటే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కేసులే ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఇన్‌పేషెంట్ సేవల కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) నిబంధనల ప్రకారం 1,816 రకాల సమగ్ర చికిత్స ప్యాకేజీలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇదిలాఉండగా ప్రస్తుతం రాష్ట్రంలోని12 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో 12 వెల్‌నెస్ కేంద్రాలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. ఉద్యోగుల రద్దీ దృష్ట్యా మరో 25 కొత్త వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో 21 కేంద్రాలను వివిధ జిల్లాల్లో, మరో 4 కేంద్రాలను గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో నెలకొల్పనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో వెల్‌నెస్ కేంద్రాల సంఖ్య 37కు చేరుకుంటుంది.
