మయన్మార్‌ తో జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌ లో భారత్‌ డ్రా

మయన్మార్‌ తో జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌ లో భారత్‌ డ్రా

న్యూఢిల్లీ, వెలుగు: మయన్మార్‌తో జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత అండర్‌–17 పురుషుల జట్టు 1–1తో డ్రా చేసుకుంది. ఆదివారం థన్లిన్‌లోని స్టార్‌సిటీ స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన మ్యాచ్‌లో వెనుకబడిన భారత్‌ పుంజుకుని స్కోరును సమం చేసింది. మయన్మార్‌ తరఫున ఆంగ్‌ మ్యాట్‌ థార్‌ 42వ నిమిషంలో గోల్‌ చేయగా.. భారత కెప్టెన్‌ దల్లాల్‌మువాన్‌ గాంగ్టే 73వ నిమిషంలో పెనాల్టీ ద్వారా గోల్‌ సాధించాడు. ఆరంభం నుంచి ఇరు జట్లు దూకుడుగా ఆడినా.. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి మయన్మార్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. 

బాక్స్‌ అంచు నుంచి ఆంగ్‌ మ్యాట్‌ థార్‌ కొట్టిన తొలి షాట్‌ను భారత డిఫెండర్‌ అభిషేక్‌ కుమార్‌ మొండల్‌ అడ్డుకున్నాడు. అయితే తిరిగి అతడి వద్దకే వచ్చిన బంతిని థార్‌ తక్కువ ఎత్తులో బలమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. భారత గోల్‌కీపర్‌ మారూఫ్‌ షఫీ పలుమార్లు అడ్డుకుని జట్టును కాపాడాడు. రెండో అర్ధభాగంలో భారత్‌ సమం చేసేందుకు వరుస దాడులు చేసింది. కెప్టెన్‌ గాంగ్టే మిడ్‌ఫీల్డ్‌లో ఆట వేగాన్ని నియంత్రిస్తూ ఇరు వైపులా దాడులను మార్చాడు. లామ్సాంగ్‌జువాలా, కమ్‌గౌహావో డౌంగెల్‌ అతడికి సహకరించారు. 72వ నిమిషంలో బాక్స్‌లోకి దూసుకెళ్లిన గాంగ్టేను హ్టూ ల్విన్‌ హాన్‌ ఫౌల్‌ చేయడంతో భారత్‌కు పెనాల్టీ లభించింది. గాంగ్టే కుడివైపు గోల్‌కీపర్‌ షిన్‌ థాంట్‌ హ్టూ అందుకోలేని విధంగా బంతిని పంపి స్కోరు సమం చేశాడు.