హైదరాబాద్, వెలుగు: అధికార బలంతో సర్పంచులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్ మల్యాల తిరుపతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సర్పంచ్ ఆరోపించిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరడం సర్పంచుల బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
