భారతీయ సంస్కృతి పరిరక్షణ అందరి బాధ్యత: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారతీయ సంస్కృతి పరిరక్షణ అందరి బాధ్యత: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • భారతీయ జీవన విధానంలోని ప్రతి అంకమూ రామమయమే..
  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరు

హైదరాబాద్, వెలుగు: భారతీయ సాంస్కృతిక పరిరక్షణ దేశంలోని ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ కర్మన్‌‌‌‌ఘాట్‌‌‌‌లోని ఎస్‌‌‌‌వైఆర్‌‌‌‌ కన్వెన్షన్ హాల్‌‌‌‌లో విశ్వహిందూ పరిషత్ పూర్వ అంతర్జాతీయ అధ్యక్షుడు, దివంగత అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందుత్వం అంటే భారతీయ జీవన విధానమని, సమాజం కోసం నిలబడే తత్వం అందులో ఉందని చెప్పారు. హిందూ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

భారతీయ జీవన విధానంలోని ప్రతి అంకమూ రామమయమేనని, ఆకలిదప్పులు, అరమరికలు లేని రాజ్యమే రామరాజ్యమని అన్నారు. మహాత్మా గాంధీ కూడా రామరాజ్యాన్ని కోరుకున్నారని చెప్పారు. అశోక్ సింఘాల్ నిబద్ధత, ధర్మంపై అచంచల విశ్వాసం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. 

సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ నైతిక విలువలు, సాంస్కృతిక మూలాల విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. కార్యక్రమంలో వీహెచ్​పీ కేంద్రీయ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్, తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు భోజనపల్లి నరసింహమూర్తి, కార్యదర్శి ఆచార్య పరాయితం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.