పీఆర్సీ తేల్చకుంటే పోరుబాటే..నాణ్యత పేరుతో బడులు మూసేస్తే సహించం :  టీఎస్ యూటీఎఫ్

పీఆర్సీ తేల్చకుంటే పోరుబాటే..నాణ్యత పేరుతో బడులు మూసేస్తే సహించం :  టీఎస్ యూటీఎఫ్
  • నవంబర్‌‌‌‌‌‌‌‌లో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని టీఎస్ యూటీఎఫ్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే నవంబర్‌‌‌‌‌‌‌‌లో మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) పిలుపునిచ్చింది. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సంఘం ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్​మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 2023 జూలై 1 నుంచి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం అందరికీ బడులు అందుబాటులో ఉండాలని, నాణ్యమైన విద్య పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల సంఖ్యను కుదించడం, మూసివేయడం సరికాదన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అవసరమైన చోట ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని, ఆ పేరుతో ఉన్న బడులను మూసేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

ప్రాథమిక పాఠశాలలకు మరణశాసనంగా మారిన జీవో 25ను సవరించి, ప్రతి ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌లో కనీసం ఇద్దరు టీచర్లను, 50 మంది పిల్లలు దాటితే తరగతికో ఉపాధ్యాయుడిని కేటాయించాలని, హెచ్ఎంలపై యాప్‌‌‌‌‌‌‌‌ల భారాన్ని తగ్గించి ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ వ్యాపారీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు అక్టోబర్ 17న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర స్థాయి సామూహిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.