కార్మికుల ఆత్మబంధువు, పేదల పెన్నిధి, దళిత శిఖరం కాకా గారు. 97వ జయంతి సందర్భంగా ప్రజా నాయకుడు గడ్డం వెంకటస్వామిగారికి ఘన నివాళి. ప్రజాపక్షమే ఆయన నిత్య నినాదం. ఏ స్థాయిలో ఉన్నా నిరంతరం ప్రజాపక్షమే ఆలోచించిన మహానేత కాకా. ఏ నిర్ణయం తీసుకున్నా అది కోట్లాది మంది పేదలకు మేలు చేసేదే అయ్యుండాలి అని తపించిన యోధుడు. తన జీవితాంతం శ్రామికుల సంక్షేమానికి బాటలు వేసిన నిత్య శ్రామికుడు గడ్డం వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా చివరి శ్వాస వరకు పేదల కోసమే పరితపించిన గొప్ప నేత కాకా.
కాకా బాల్యం నుంచే దేశభక్తి, సోషలిస్టు భావాలు పుణికి పుచ్చుకున్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, జయప్రకాశ్ నారాయణ వంటి మహానుభావులను ప్రత్యక్షంగా చూసి స్ఫూర్తి పొందారు. ఆ స్ఫూర్తిని తన నిజ జీవితంలో ఆచరించి చూపించారు.
తెలంగాణ కోసం బుల్లెట్ గాయాలు మోసిన యోధుడు
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కాకా పాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రత్యేక రాష్ట్రమే శ్వాసగా, తెలంగాణయే ఆశగా బతికిన నేత ఆయన. 1969 ఉద్యమంలో జైలుకు వెళ్లారు. బుల్లెట్ గాయాలను కూడా లెక్కచేయలేదు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి పాస్ చేయించే వరకు ఆయన పోరాటం ఆగలేదు.
గుడిసెల వెంకటస్వామిగా ప్రజల గుండెల్లో..
హైదరాబాద్ నగరంలో ఆయనకు ‘గుడిసెల వెంకటస్వామి’ అనే బిరుదు ప్రజలే ఇచ్చారు. 1949లో నేషనల్ హట్స్ యూనియన్ స్థాపించి, ప్రభుత్వ, భూస్వాముల ఖాళీ స్థలాల్లో పేదలకు గుడిసెలు వేయించారు. 20 ఏళ్ల పాటు నిరంతరం పోరాడి సుమారు 85 వేల మందికి పైగా నిరుపేదలకు నివాసాలు ఏర్పాటు చేశారు. ఆ మహానుభావుడిని జంట నగరాల పేదలు దేవుడిగా కొలుస్తారు.
కార్మిక లోకానికి పెద్ద దిక్కు
1990లో దాదాపు కుప్పకూలిన సింగరేణి సంస్థను కాపాడిన రక్షకుడు కాకా. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రూ. 1,100 కోట్లు అప్పుగా ఇప్పించి, సంస్థను తిరిగి లాభాల బాట పట్టించారు.
మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించిన ఘనత
దేశ చరిత్రలో తొలిసారిగా మూతపడిన పరిశ్రమను తెరిపించిన ఘనత కూడా కాకాదే. రామగుండం ఫర్టిలైజర్ కంపెనీని కేంద్రంతో పోరాడి రీఓపెన్ చేయించి 3 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం కార్మికుల గొంతును వినిపించారు.
ప్రపంచం మెచ్చిన పెన్షన్ స్కీం
కేంద్ర కార్మిక మంత్రిగా ప్రపంచం మెచ్చిన పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టడం చరిత్రలో గొప్ప మైలురాయి. ప్రైవేట్ రంగ కార్మికులకు వృద్ధాప్యంలో భద్రత కల్పించాలనే ఆలోచనతో ఈ స్కీం తీసుకువచ్చారు. 1995లో బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీం కూడా రూపొందించిన ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని పార్లమెంట్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాన్నే డిమాండ్ చేసిన నిఖార్సయిన నాయకుడు.
ప్రజా ప్రభుత్వం..కాకా బాటలో
ఈ రోజు ప్రజా ప్రభుత్వం కూడా కాకా బాటలోనే నడుస్తోంది. ముఖ్యంగా నేటి ఆధునిక కార్మికులు - గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కాకా ఆశయాలకు కొనసాగింపు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ఇన్సూరెన్స్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది కాకా కార్మికులకు పెన్షన్ తెచ్చిన స్ఫూర్తే.
కుటుంబమంతా కాకా అడుగుజాడల్లో..
కాకా కుటుంబం నేటికీ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తోంది. పెద్ద కుమారుడు గడ్డం వినోద్ కుమార్, చిన్న కుమారుడు, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మనవడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. ఇలా అందరూ కాకా బాటలోనే పేదల సేవలో ఉన్నారు. గతంలో కాకా సంఘటిత కార్మికుల కోసం పోరాడితే, నేడు ఆయన తనయుడు వివేక్ అసంఘటిత, గిగ్ వర్కర్ల కోసం అదే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇది తండ్రి నుంచి తనయుడికి సంక్రమించిన సేవా నిరతి.
అంబేద్కర్ స్ఫూర్తితో విద్యా సేవ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాలకు ఉన్నత చదువులు అందించాలని సంకల్పించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా 1973లో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీని ప్రారంభించి లక్షల మందికి విద్యను అందించారు. కాకా స్ఫూర్తితోనే ఆయన వారసులు కూడా లక్షల మందికి ఉన్నత విద్యాభ్యాసం అందిస్తున్నారు.
తరాలకు మార్గదర్శి
రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేజారినా, రాష్ట్రపతి పదవికి అవకాశం వచ్చి దక్కకపోయినా ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు కొనసాగిన కాకా రాజకీయ ప్రస్థానం ఎన్నో మైలురాళ్లతో నిండి ఉంది. ప్రజాహితం, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన అంకితభావం నేటి తరానికి మార్గదర్శకం. ప్రజా ప్రభుత్వం కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తుండగా, మనందరం కాకా బాటలో నడవాలని కోరుకుంటూ ఆ మహానేతకు ఘన నివాళి అర్పిద్దాం.
గడ్డం ప్రసాద్ కుమార్,తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
