తాడ్వాయి, వెలుగు: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్(టీపీఆర్సీ) రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి కోరారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం పగిడిద్దరాజు భవన్ లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులు చాలీచాలని జీతాలతో, ఆర్థిక ఇబ్బందులతో ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. సర్పంచులకు నెలకు రూ.30 వేల వేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం ములుగు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ముష్కేపల్లి కుమార్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. గడ్డం నాగభూషణం, పూస్కూరి అశోక్ రావు, గుంటుపల్లి నాగమల్లేశ్వర్, నంగావత్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.
