వెలుగు స్పెషల్ : జన నాయకుడు .. కాకా తెలంగాణ పిపాసి

వెలుగు స్పెషల్ :  జన నాయకుడు .. కాకా తెలంగాణ పిపాసి

ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసిన నాయకుడు, మాజీ కేంద్ర మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి చిరస్మరణీయుడు. యువకుడిగా నైజాం పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకత్వంలో స్వతంత్ర భారత పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.

 పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలుగు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా  ఏర్పాటు చేసే సందర్భంలో తన అసమ్మతి గళాన్ని వినిపించారు. 1969 తొలిదశ ఉద్యమంలో  తెలంగాణ ప్రాంతం పట్ల జరుగుతున్న వివక్షతపై గళాన్ని వినిపించారు. కాకా 97వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బడుగువర్గాలు ఆయనను  స్మరించుకుంటున్నారు.

కాంగ్రెస్ నాయకునిగా, పార్లమెంటు సభ్యునిగా మంత్రివర్యులుగా కార్మిక, పేద వర్గాల పక్షపాతిగా వారి గుండెల్లో గూడు కట్టుకొని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరువ చేశారు. కాంగ్రెస్ 
పార్టీలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ  బాధ్యతలను నిర్వహించి ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు విశ్వసనీయతను గెలుచుకున్న, పేద వర్గాల హితం కోరుకున్న నాయకుడు కాకా.  80 వేలకు పైగా నిరాశ్రయ గుడిసె వాసులకు పక్కా ఇండ్లను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో ఆయన ఎంతో శ్రద్ధ వహించారు. 

తెలంగాణ పిపాసి

మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన  సభలలో ప్రొఫెసర్ జయశంకర్ సమక్షంలో వెంకటస్వామి ప్రసంగించారు. మేధావులకు, విద్యార్థులకు, పరిశోధకులకు ప్రోత్సాహం కలిగించారు. ఉద్యమ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానంతో సంబంధాలు ఏర్పడేలా చర్చలు జరగడానికి కృషి చేశాడు. 

తెలంగాణ విషయంలో అధిష్టానాన్ని ఒప్పించడానికి అంతర్గతంగా ఎంతో కృషి చేశారు. మలిదశ ఉద్యమం ప్రారంభం చేసిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను, మేధావులను, కార్మికులను చైతన్యం చేయడానికి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణవాదిగా ఎంతో ఆదరించి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. 

2004 శాసనసభ, లోక్​సభల ఎన్నికల సందర్భంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలు పర్యటించినప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం ముఖ్యంగా గోదావరిఖని, మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాల్లో  మేం నిర్వహిస్తున్న సభలకు సహకారం అందించారు. ఆ స్ఫూర్తిని కుటుంబ వారసత్వ సంపదగా వారి కుమారులు, మనవడు కూడా కొనసాగించడం హర్షించదగిన  విషయం. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాకా  సోనియాగాంధీని, చిదంబరాన్ని, మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించిన సందర్భాలు నాకు గుర్తు ఉన్నాయి.  కొండా లక్ష్మణ్ బాపూజీతో  మేం జంతర్ మంతర్​లో  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్షలు నిర్వహించినప్పుడు సందర్శించి మద్దతు ప్రకటించారు.   ప్రొఫెసర్ జయశంకర్ ఇతర జాక్ నాయకులను కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరాన్ని కలిపి రాష్ట్ర అవశ్యకతను వెంకటస్వామి వివరించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ , యూపీఏ ఇతర భాగస్వామ్య పార్టీల నేతలతో కలవడానికి కాకా ప్రయత్నం చేశారు. 

పేద వర్గాలకు ముఖ్యంగా వేలాదిమంది కార్మికులకు పేదలకు నివాస స్థలాలు కల్పించి నివాసయోగ్యమైన వసతుల నిర్మాణానికి కృషి చేశారు. అనేక కార్మిక చట్టాలను సవరించి సంక్షేమ పథకాలను అమలుపరిచి కార్మిక పక్షపాతిగా చెరగని ముద్ర వేసుకున్నారు. 

సమకాలీన సమాజంలో అనేకమంది బహుజన నాయకులు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నవారందరికీ దివంగత నాయకులు గడ్డం వెంకటస్వామి వ్యక్తిత్వం, నాయకత్వం ఒక స్ఫూర్తి కావాలని ఆయన జన్మదినం సందర్భంగా కోరుకుందాం. అదే వారికి ఆత్మీయ నివాళి. 


 
ప్రొఫెసర్ కూరపాటి  వెంకట్ నారాయణ

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.