ఘనంగా ముగిసిన ఆసియా క్రీడలు.. నాగోయా వేదికగా జపాన్‌ సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శనతో ముగింపు వేడుకలు

ఘనంగా ముగిసిన ఆసియా క్రీడలు.. నాగోయా వేదికగా జపాన్‌ సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శనతో ముగింపు వేడుకలు
  •     పతకాల పట్టికలో నాలుగో స్థానంలో భారత్‌.. 21 స్వర్ణాలతో కలిపి 85 పతకాలు
  •     వరుసగా 12వసారి అగ్రస్థానంలో చైనా.. 2030 ఆసియా క్రీడలకు ఖతార్‌ ఆతిథ్యం

నాగోయా : జపాన్‌ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యానికి అద్దం పట్టేలా నిర్వహించిన అద్భుతమైన లైటింగ్​, సంగీత కార్యక్రమాల నడుమ ఆసియా క్రీడలకు తెరపడింది. ఆదివారం నాగోయాలోని మిజుహో పార్క్‌ అథ్లెటిక్స్‌ స్టేడియంలో 90 నిమిషాలపాటు ముగింపు వేడుకలు కన్నులపండువగా సాగాయి. రెండు వారాలకు పైగా సాగిన ఈ క్రీడల్లో 350కి పైగా రికార్డులు నమోదయ్యాయి. వీటిలో 50కిపైగా ప్రపంచ రికార్డులు ఉండటం విశేషం. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు ముగింపు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నాలుగో స్థానంలో భారత్‌

పతకాల పట్టికలో భారత్‌ 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. గత ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలతో పోలిస్తే ఈసారి భారత్‌ 21 పతకాలు తక్కువగా సాధించింది. చైనా 169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలతో మొత్తం 341 పతకాలు సాధించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా క్రీడల్లో వరుసగా 12వసారి టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. జపాన్‌ 83 స్వర్ణాలు సహా 269 పతకాలతో రెండో స్థానంలో, దక్షిణ కొరియా 39 స్వర్ణాలు సహా 150 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.

2030లో ఖతార్‌లో తదుపరి క్రీడలు

ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) అధ్యక్షుడు షేక్‌ జోవాన్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ క్రీడలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి జపాన్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, ప్రిన్సెస్‌ అకిషినో హాజరయ్యారు. అనంతరం 2030లో ఖతార్‌లో జరగనున్న 21వ ఆసియా క్రీడల నిర్వాహకులకు ఓసీఏ జెండాను అప్పగించారు. ఖతార్‌ ఒలింపిక్‌, ప్రపంచ ఛాంపియన్‌ ముతాజ్‌ బర్షిమ్‌ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖతార్‌ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహమాన్‌ అల్‌ థానీకి జెండాను అందజేశారు.

ఒక్కటైన ఆసియా..

'వన్‌ ఆసియా' ఇతివృత్తంతో రూపొందించిన ముగింపు వేడుకల్లో జపాన్‌ సంప్రదాయ నృత్యాలు, సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెర్రీ పూల అలంకరణలతో కూడిన దుస్తులు ధరించిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. బోన్‌ ఒడోరి సంప్రదాయ నృత్యంతోపాటు నాగోయా ప్రత్యేకతను చాటే 'మత్సుకెన్‌ సాంబా-2' పాటకు కళాకారులు నృత్యాలు చేశారు. 

రంగురంగుల లాంతర్లతో అలంకరించిన షట్కోణ వేదిక, లేజర్‌ కాంతుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారత్‌ తరఫున ట్రాప్‌ షూటర్‌ నీరూ ధండా జాతీయ పతాకధారిగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో ఆమె రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించారు. సుమారు 30 మంది భారత క్రీడాకారులు, అధికారులు తెలుపు, నీలం రంగు దుస్తుల్లో త్రివర్ణ పతాకాన్ని చేతబూని అథ్లెట్ల పరేడ్‌లో పాల్గొన్నారు.'ఆసియా క్రీడలు ఆసియా క్రీడా రంగానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఎన్నో అద్భుత విజయాలు, ఉత్కంఠభరిత పోటీలు, యువ క్రీడాకారుల ఎదుగుదలకు ఈ క్రీడలు వేదికయ్యాయి. జపాన్‌లో జరిగిన ఈ పోటీలు ఆసియా క్రీడల భవిష్యత్తుకు స్ఫూర్తినిస్తాయి' అని ఓసీఏ అధ్యక్షుడు అల్‌ థానీ పేర్కొన్నారు. నాలుగేళ్ల తర్వాత దోహాలో మళ్లీ కలుద్దామని ఆసియా యువతకు పిలుపునిచ్చారు.

భారత అథ్లెట్లకు మోదీ అభినందనలు

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పై  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దేశం తరఫున పట్టుదల, ఉత్సాహం, క్రీడాస్ఫూర్తితో పోటీపడ్డ భారత బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. పతక విజేతలందరికీ అభినందనలు తెలిపిన మోదీ.. వారి ప్రదర్శనలు దేశ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు.