పాలమూరులో ‘బ్రహ్మోస్‌‌‌‌’ స్పీడప్.. మిస్సైల్‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌ ఏర్పాటు

పాలమూరులో ‘బ్రహ్మోస్‌‌‌‌’ స్పీడప్.. మిస్సైల్‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌ ఏర్పాటు
  • మిస్సైల్​ తయారీ యూనిట్​కు 416.18 ఎకరాలు
  • ప్రతిపాదించిన టీజీఐఐసీ
  • నేటి నుంచి పట్టా భూముల్లోనూ సర్వే
  • పరిహారం కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో ప్రతిష్టాత్మక బ్రహ్మోస్‌‌‌‌ మిస్సైల్‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. యూనిట్‌‌‌‌ కోసం దేవరకద్ర మండలంలోని మూడు గ్రామాల్లో 416.18 ఎకరాల భూమిని అధికారులు గుర్తించి సర్వేలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల సర్వే పూర్తి కాగా, పట్టా భూముల పరిశీలన కొనసాగుతోంది. 

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌సింగ్‌‌‌‌తో చర్చించిన నేపథ్యంలో యూనిట్‌‌‌‌ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తమవుతుండటంతో.. పాలమూరులో రక్షణ రంగ పరిశ్రమకు మార్గం సుగమమవుతోంది. ఈ యూనిట్‌‌‌‌ ఏర్పాటైతే స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో బ్రహ్మోస్‌‌‌‌ మిస్సైల్‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌ ఏర్పాటు పనులు ఊపందుకుంటున్నాయి. డిఫెన్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌(డీఆర్‌‌‌‌డీవో) అధికారులు గతేడాది జులైలో జిల్లాలో పర్యటించి భూములను పరిశీలించారు. అనుకూల వాతావరణం, అవసరమైన స్థాయిలో భూమి అందుబాటులో ఉండటం, రైలు, రోడ్డు మార్గాలు అనువుగా ఉండటంతో ఇక్కడ యూనిట్‌‌‌‌ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత నెల సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌ను కలిసి పాలమూరులో బ్రహ్మోస్‌‌‌‌ మిస్సైల్‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌ ఏర్పాటుపై చర్చించారు. ఈ చర్చల్లో కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సర్వేలు చేపట్టింది.

మూడు గ్రామాల్లో 416.18 ఎకరాలు గుర్తింపు..

బ్రహ్మోస్‌‌‌‌ మిస్సైల్‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌ కోసం దేవరకద్ర మండలంలోని జీనుగురాల, చౌదర్‌‌‌‌పల్లి, బస్వాయిపల్లి గ్రామాల్లో మొత్తం 416.18 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. భూముల సర్వే చేయాలని ఇండస్ట్రియల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(టీజీఐఐసీ) కొద్దిరోజుల కిందట రెవెన్యూ అధికారులను కోరింది. దీంతో అధికారులు రెండు వారాలుగా మూడు గ్రామాల్లో ప్రభుత్వ భూములపై సర్వే చేసి నివేదిక సిద్ధం చేశారు. 

అందుబాటులో ఉన్న పట్టా భూముల వివరాలను కూడా సేకరించారు. చౌదర్‌‌‌‌పల్లి గ్రామంలోని 295, 296 సర్వే నంబర్లలో 17.18 ఎకరాలు, బస్వాయిపల్లిలోని 21 సర్వే నంబర్లలో 126.29 ఎకరాలు, సర్వే నంబర్‌‌‌‌ 308లో 5.16 ఎకరాలు, సర్వే నంబర్‌‌‌‌ 294లో సీలింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ పట్టాలో 15.30 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. జీనుగురాలలో 14 సర్వే నంబర్లలో 187.33 ఎకరాలు, సర్వే నంబర్‌‌‌‌ 112లో 4.18 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు.

రైతులకు సమాచారం ఇచ్చి సర్వే..

ప్రభుత్వ భూముల సర్వే పూర్తిచేసిన అధికారులు బుధవారం నుంచి పట్టా భూముల్లోనూ సర్వే చేపట్టనున్నారు. సర్వేకు ఒక రోజు ముందే సంబంధిత గ్రామ పంచాయతీ ద్వారా రైతులకు సమాచారం అందిస్తున్నారు. రైతులు పొలం వద్దకు వచ్చి సర్వేకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. 

రైతుల సమ్మతితోనే సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. పట్టా భూముల సర్వే పూర్తయిన తర్వాత పరిహారం నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్‌‌‌‌, ఆర్డీవోల ఆధ్వర్యంలో భూములకు ధర నిర్ణయించే 
అవకాశం ఉంది.

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు..

యూనిట్‌‌‌‌ ఏర్పాటైతే స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఫిట్టర్‌‌‌‌, ఎలక్ట్రీషియన్‌‌‌‌, వెల్డర్‌‌‌‌, మెకానికల్‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కమ్యూనికేషన్స్‌‌‌‌, క్వాలిటీ టెస్టింగ్‌‌‌‌ విభాగాలతో పాటు ఆఫీస్‌‌‌‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టోర్‌‌‌‌ కీపర్లు, సెక్యూరిటీ, డ్రైవర్లు, రవాణా, క్యాటరింగ్‌‌‌‌, హౌస్‌‌‌‌కీపింగ్‌‌‌‌ సిబ్బందికి డిమాండ్‌‌‌‌ పెరగనుంది. ఐటీఐ, ఇంజినీరింగ్‌‌‌‌, డిగ్రీ పూర్తి చేసిన వారికి టెక్నికల్​, ఇంజినీరింగ్‌‌‌‌, నాన్‌‌‌‌ టెక్నికల్‌‌‌‌, అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ విభాగాల్లో అవకాశాలు లభించే అవకాశం ఉంది.