వీకెండ్ వచ్చిందంటే చాలు.. సిటీ రణగొణ ధ్వనులకు బ్రేక్ చెప్పి పల్లెబాట పడుతున్నారు హైదరాబాద్ జనం. మట్టి వాసన.. పచ్చని పొలాలు.. ఎద్దుల బండి.. పల్లె రుచులు.. ఒక్కరోజైనా అసలైన విలేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలంటున్నారు. ఫామ్‌హౌస్ పార్టీలు కాదు.. ఫామ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌నే కొత్త వీకెండ్ ట్రెండ్‌గా మార్చేస్తున్నారు. వీకెండ్ ఎక్కడికైనా ట్రిప్ వేయాలనుకునే నగరవాసులు ఇప్పుడు కొత్తదారి పడుతున్నారు.
హైదరాబాద్ నగర చుట్టుపక్కల అగ్రిటూరిజం, ఫామ్ విజిట్స్, ఫామ్‌స్టేలు ఇలా వీకెండ్‌కి కొత్త డెస్టినేషన్లుగా మారాయి. సిటీ లైఫ్‌లో బిజీగా ఉండే కుటుంబాలు శని, ఆదివారాల్లో మాల్స్, రెస్టారెంట్లకు బదులు పొలాలబాట పడుతున్నాయి. మట్టిలో కాసేపు గడపడం, పంటలు ఎలా పండుతాయో తెలుసుకోవడం, స్వయంగా కూరగాయలు కోయడం, గ్రామీణ వంటకాల రుచి చూడటం, ఫామ్‌లోనే రాత్రి బస చేయడం వంటి అనుభవాలు అగ్రిటూరిజంలో భాగమవుతున్నాయి. పొలంలో పుట్టిన వీకెండ్ కల్చర్ సిటీలో చదివే పిల్లలకు పల్లె పాఠాలుగా మారాయి.‘విలేజ్ స్టే’, ‘ఫామ్ స్టే’లకు కొత్త తరం నుంచి డిమాండ్ పెరుగుతోంది.కుటుంబాలు, స్నేహితులు, పాఠశాలలు, కార్పొరేట్ బృందాలకు సరైన వేదిక.. ఏ సందర్భానికైనా అనుకూలమైన ప్యాకేజీలు అగ్రిటూరిజం యాత్రలు.
ఆనందగఢ్ పిక్నిక్ ఫామ్
శామీర్‌పేట కేశవరం సమీపంలో వెలసిన ఆనందగఢ్ పిక్నిక్ ఫామ్‌లో ట్యూబ్‌వెల్ స్నానం, రోప్ కోర్సులు, విలువిద్య, గ్రామీణ బఫే వంటకాలు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫామ్‌లో 60కి పైగా గ్రామీణ కార్యకలాపాలు, అగ్రి-టూరిజం వాతావరణం ప్రత్యేకతలు. ఆనంద్‌గఢ్‌లోని అందమైన పిక్నిక్ ప్రదేశాలు, ఉత్కంఠభరితమైన కార్యకలాపాలు, మరువలేని కార్యక్రమాలను వీక్షించవచ్చు. కుటుంబ విహారయాత్రల నుంచి కార్పొరేట్ కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకల వరకు ఆనందభరితమైన క్షణాలను చవిచూడవచ్చు. పగటిపూట పిక్నిక్కు రాగానే స్వాగత పానీయాలు, పచ్చని ప్రకృతి ఒడిలో పిక్నిక్ ప్రాంతాల సందర్శన, క్రీడలు, వినోదభరితమైన ఆటలు,సరదా కార్యకలాపాలు, ఇంటరాక్టివ్ సెషన్లు, బోర్‌వెల్ స్నానం, రెయిన్ డాన్స్, అవుట్‌డోర్ ఆటలు, సాహసోపేత కార్యకలాపాలు, లైవ్ ఫుడ్ కౌంటర్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అగ్రి టూరిజం మేనేజరు ఆనంద్ రాథోడ్ చెప్పారు.
ఆనందక్షేత్రంలో ఆనందంగా...
ఈ క్షేత్రంలో సందర్శకులు వరి, మామిడి తోటల్లో పర్యటించవచ్చు. విత్తనాలు నాటడం,సేంద్రియ పద్ధతిలో పంట కోయడం లాంటి వ్యవసాయ పనులు చేయవచ్చు. ఫార్మ్ -టు -టేబుల్ భోజనం, స్థానిక తెలంగాణ వంటకాలు, సాత్విక బఫేలు, తాజా చెరకు రసం, సేంద్రియ పాల ఉత్పత్తుల రుచి చూడవచ్చు. వ్యవసాయ క్షేత్రంలో ట్యూబ్‌వెల్ స్నానాలు, మట్టి చికిత్స స్నానాలు చేయవచ్చంటారు ఆనందక్షేత్రం మేనేజరు రూబెన్ చరణ్. తమ ఫామ్ పర్యటనకు వచ్చే సందర్శకులు ఒక జత కాటన్ దుస్తులు, నడవడానికి సౌకర్యవంతమైన బూట్లు, టోపీలు ధరించి సన్‌స్క్రీన్‌ను వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. వ్యవసాయ క్షేత్ర పర్యటనలో గ్రామీణ జీవితంలో కుండల తయారీ, ఎద్దుల బండిపై ప్రయాణం లేదా ట్రాక్టర్ సవారీలు, సంప్రదాయ గ్రామీణ ఆటలు లగోరి, గిల్లీ దండా, గాలిపటాలు ఎగురవేయవచ్చు. ఈ క్షేత్రంలో విత్తనాలు నాటడం, పంట కోత, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవచ్చు. జొన్న రొట్టె, పప్పు, పచ్చిపులుసు, పల్లె వంటకాలతో భోజనం చేయొచ్చు. పచ్చని పొలాల మధ్య వాకింగ్ చేయడం, చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం, పక్షుల సందడిని తిలకించొచ్చు. క్యాంప్‌ఫైర్, నక్షత్రాల కింద రాత్రి నిద్ర పోవడం మర్చిపోలేని అనుభూతులను ఫామ్ స్టే మిగిలిస్తోంది. పిల్లలకు వ్యవసాయం, ఆహారం, గ్రామీణ జీవనంపై ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తోంది.
వన్ డే కిసాన్
నాగలి దున్నడం, ట్రాక్టర్, ఎద్దుల బండి సవారీలు చేయడం, పచ్చని పొలాల్లో విహరిస్తూ ఒక రోజు రైతుగా మారొచ్చు అంటున్నారు వన్ డే కిసాన్ ఫామ్ నిర్వాహకులు. పెంపుడు జంతువులు, అరుదైన పక్షులను,గూళ్లను తిలకిస్తూ అందులోని జీవవైవిధ్యాన్ని గుర్తించవచ్చు. సంప్రదాయ వ్యవసాయ పనిముట్లు, నీటిపారుదల నమూనాలు, వర్మీకంపోస్టింగ్ విధానాలను చూడొచ్చు. కుండలు చేయడం, పేడ పిడకలు, దిష్టిబొమ్మలు తయారు చేయవచ్చు. పొలాలు దున్నడం, వరి నాట్లు వేయడం,ట్రాక్టర్ విహారాలు, ఆవులతో ముద్దుమురిపాలు, ఎద్దుల బండి విన్యాసాలను చూడవచ్చు. సిద్ ఫామ్‌లో బాతులతో కలిసి నడవవచ్చు. సందర్శకులు ఆవులకు మేత తినిపించడం, పాలు పిండడం వంటివి చేయవచ్చు. మొక్కలు నాటడం, మట్టిలో పని చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
యాక్టివ్ ఫామ్ స్కూల్ : వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి.. వాటికి సంబంధించిన వివిధ దశల గురించి తెలుసుకోవడానికి యాక్టివ్ ఫామ్ స్కూలు సరైన వేదిక. యాక్టివ్ ఫామ్ స్కూల్ పాఠశాల విద్యార్థులు, కుటుంబాలు, కార్పొరేట్ బృందాల కోసం విహారయాత్రలను నిర్వహిస్తుంది. 5 గంటల సందర్శన నుంచి ఆరు రోజుల క్యాంప్ వరకు విహార యాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠశాల వ్యవసాయంలో సర్టిఫికెట్ కోర్సులను కూడా అందిస్తుంది. చేవెళ్ల మండలంలో ఉన్న యాక్టివ్ ఫామ్ స్కూల్ హైదరాబాద్ నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వెన్నెల ఫామ్స్ : హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ సమీపంలో ఉన్న ఈ ఫామ్ సేంద్రీయ వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తుంది.
లక్ష్యాస్ నాచురల్ ఫుడ్స్: లక్ష్యాస్, ఇన్ ఏకర్స్ సహకారంతో ప్రతి నెలా మొదటి, మూడవ ఆదివారాల్లో తమ పచ్చని సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలో ఒకరోజు పర్యటనను అందిస్తుంది. హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల వ్యవసాయ కార్యకలాపాల మధ్య స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించొచ్చు. ఈ ఫామ్‌లో పిల్లలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తారు. ఒక రోజు పర్యటనకు ఒక వ్యక్తికి రూ.500 రుసుముతో ఆర్గానిక్ ఫుడ్ కూడా అందిస్తున్నారు.
హైడౌట్: హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే, రెండున్నర ఎకరాలలో విస్తరించి ఉన్న హైడౌట్ అనే ఫామ్‌హౌస్ వస్తుంది. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి సేద తీరడానికి ఇది ఒక సరైన వారాంతపు గమ్యస్థానం. ఇక్కడ మీరు సరస్సు దృశ్యాన్ని చూస్తూ పుస్తకం చదువుకోవచ్చు. వివిధ రకాల వృక్షజాలం మధ్య తీరికగా నడవొచ్చు. పక్షులను వీక్షించొచ్చు.వీకెండ్ అంటే పార్టీలు.. షాపింగ్‌లే కాదు.. ఒక్కరోజైనా మట్టితో మమేకమై.. పల్లె గుండెల్లో సేదతీరాలనుకునే సిటీ జనాల సంఖ్య పెరుగుతోంది!
పొలమే వీకెండ్ ప్లేగ్రౌండ్!
తెలంగాణ టూరిజం అధికారిక హోమ్‌స్టే జాబితాలో కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, శామీర్‌పేట్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఫామ్, హోమ్‌స్టేలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 60కి పైగా గ్రామీణ, అగ్రి - టూరిజం కార్యకలాపాలు, ఫామ్ డే అవుటింగ్, నైట్ స్టేలు ఉన్నాయి. వాస్తునగర్లో రుస్టిక్ విలేజ్ ఫామ్ స్టే, శంషాబాద్‌లో వింగ్ వ్యాలీ ఫామ్ స్టే, మొయినాబాద్‌లో సిరినీ ఫాం గిల్డ్ స్టోన్ స్టే, తుర్కగూడలో ఫాంహౌస్ స్టేలు ఉన్నాయి. సిటీ లైఫ్‌లో బిజీగా ఉండే కుటుంబాలు శని, ఆదివారాల్లో మట్టిలో కాసేపు గడపడం, పంటలు ఎలా పండుతాయో తెలుసుకోవడం, స్వయంగా కూరగాయలు కోయడం, గ్రామీణ వంటకాలు రుచి చూడటం, ఫామ్‌లోనే రాత్రి బస చేయడం వంటి అనుభవాలు అగ్రిటూరిజంలో భాగమవుతున్నాయి. కిట్టీ పార్టీలు, పాత స్నేహితుల పునఃకలయికలు, బంధువుల కలయికలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, మైలురాళ్ల వేడుకలు, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ వేడుకలు, కార్పొరేట్ రిట్రీట్‌లు, పాఠశాల ఫీల్డ్ ట్రిప్‌లు, ఫామ్‌లో రాత్రి బసలు, వనభోజనాలు ఇలా ఒకటేమిటి పచ్చని ప్రకృతి ఒడిలో మైలురాళ్లను జరుపుకోండి. శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలను సొంతం చేసుకోండి అంటున్నారు వ్యవసాయక్షేత్రాల యజమానులు.
గోదేశీ ఆగ్రో టూరిజం
తెలంగాణలోని ఉత్తమ ఆగ్రో టూరిజం గమ్యస్థానాల్లో ఒకటైన గోదేశీ ఆగ్రో టూరిజం నగరవాసులకు మరపురాని వ్యవసాయ క్షేత్ర అనుభవాలను అందిస్తుంది. కుటుంబ విహారయాత్ర, పాఠశాల విహారయాత్ర, బృంద విహారయాత్ర, కలయికలు, లేదా వారాంతపు విహారయాత్రను ప్లాన్ చేస్తున్నా, గోదేశీ ఆగ్రో టూరిజం మర్చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తుందని గోదేశీ మేనేజర్ శ్రీధర్ చెప్పారు. సేంద్రీయ సేద్యం, గిర్ ఆవుల నుంచి గోదేశీ మిల్క్ ఈ ఫామ్ ప్రత్యేకత. దేశీ గిర్ ఆవుల పెంపకం, గడ్డి, దాణా వేయడం, వర్మీకంపోస్టు తయారీ, పాలు పితకటం, పాల నుంచి పెరుగు తయారీ, పెరుగు నుంచి మజ్జిగ తయారీ, ఇందులో నుంచి వెన్న తీయడం ఆపై నెయ్యి తయారీ గురించి పాఠశాల పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని గోదేశీ ఆగ్రో ఫాం డైరెక్టర్ వీరేందర్ ఎం. చెప్పారు. పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల మధ్య కుటుంబాలు, స్నేహితులు గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకోవచ్చంటారు గోదేశీ ఫాం డైరెక్టర్.
