లంగ్స్ వాక్ తో... హైదరాబాద్ సిటీకి కాస్త ఊపిరి!

లంగ్స్ వాక్ తో...  హైదరాబాద్  సిటీకి కాస్త ఊపిరి!

ఎటుచూసినా ఎత్తైన భవనాలు.. రయ్‌‌ రయ్‌‌మంటూ పరుగులు తీసే వాహనాలు.. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే నగర జీవితం.. ఇదీ నేటి హైదరాబాద్‌‌! కానీ ఈ కాంక్రీట్ జంగిల్‌‌లోనూ ప్రకృతి తన ఆనవాళ్లను కాపాడుకుంటూనే ఉంది. చెట్ల నీడలో.. సరస్సుల ఒడ్డున.. పక్షుల కిలకిలరావాల్లో.. సీతాకోకచిలుకల రెక్కల్లో.. ఇంకా ఓ పచ్చని హైదరాబాద్‌‌ కనిపిస్తోంది. ఆ ప్రకృతి జాడలను గుర్తించి.. నమోదు చేసి.. కాపాడేందుకు హైటికోస్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు ‘లంగ్స్’ పేరుతో సాగుతున్న వినూత్న ప్రయత్నమే ఈ నేచర్ వాక్‌‌లు. 

జీవవైవిధ్యంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా వెలసిన వనాలు, పార్క్​ల్లో, వివిధ పక్షులను డాక్యుమెంట్ చేసి వాటిని కాపాడాలనే లక్ష్యంతో హైటికోస్ వాలంటీర్లు నగరానికి ఊపిరితిత్తులు కాన్సెప్ట్‌‌తో చేపడుతున్న లాస్ట్ అర్బన్ నేచురల్ గ్రీన్ స్పేస్ (లంగ్స్) కార్యక్రమం ఆకట్టుకుంటోంది. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి తెలంగాణ అటవీశాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చని పార్క్​లు, అర్బన్ ఫారెస్ట్​ పార్క్​లను ఏర్పాటు చేసింది.

జూబ్లీహిల్స్​లో పక్షుల కిలకిలరావాలు, నెమళ్లు, పచ్చని చెట్లతో కూడిన కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం, వనస్థలిపురంలో చెంగుచెంగున దూకే జింకలతో కూడిన మహావీర్ హరిణ వనస్థలి జాతీయ వనం, చిలుకూరులో కొండలు, గుట్టలు, సఫారీతో కూడిన మృగవని జాతీయ ఉద్యానవనం ఆకట్టుకుంటున్నాయి. మేడ్చల్ జాతీయ రహదారి సమీపంలో వాకింగ్ ట్రాక్, యోగా సెంటర్, బట్టర్ ఫ్లై గార్డెన్లతో కూడిన కండ్లకోయ ఆక్సిజన్ పార్క్, నార్సింగిలో సరస్సులు, రాళ్లు, గుట్టలు, ఫారెస్ట్ ట్రెక్ పార్క్, నారపల్లిలో వాచ్ టవర్, డీర్ పార్క్​లతో కూడిన వనం నగర ప్రజలకు కొత్త ఊపిరి పోస్తుంది. వాకింగ్, జాగింగ్ ట్రాక్​లున్న దుండిగల్ ప్రశాంతవనం, ఐటీకారిడార్ మధ్యన కొండాపూర్ బొటానికల్ గార్డెన్, తుక్కుగూడ దగ్గర 526 హెక్టార్లలోని శ్రీనగర్ అటవీ పార్క్ ప్రజలకు పచ్చదనాన్ని పంచుతోంది. అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే కొత్వాల్ గూడ దగ్గరున్న ఎకోపార్క్ పచ్చికబయళ్లతో ఆకట్టుకుంటోంది. కందుకూరు లేమూర్​లో మన్యం కంచ పార్క్ పచ్చని గుట్టలతో అలరారుతోంది. మహేశ్వరం నాగారం దగ్గరున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్​లోని సరస్సులో పడవలో విహరించొచ్చు. గండిపేట జలాశయం తీరాన ఉన్న లేక్ వ్యూ పార్క్ వాక్ వే, పిక్నిక్ స్పేస్, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆకట్టుకుంటున్నాయి.  

ఎన్నో లేక్ పార్క్​లు

సిటీలోని చెరువుల తీరాన పార్క్​లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఏర్పాటు చేసింది. దుర్గం చెరువు, సఫిల్ గూడ చెరువు, బాపూఘాట్ వంటి చోట్ల ఏర్పాటు చేసింది. కేబీఆర్ పార్క్​లో వాక్ వే, లంగర్ హౌస్ లేక్ పార్క్, పాలపిట్ట సైక్లింగ్ పార్క్, మేడిపల్లిలోని జటాయువు పార్క్, దమ్మాయిగూడలోని ఆరోగ్యవనం, గుర్రంగూడ ఎకో పార్క్, లుంబినీవనం, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరా పార్క్, పబ్లిక్ గార్డెన్, కంటోన్మెంట్ పార్క్, సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్, నారాయణగూడ డాక్టర్ జీఎస్ మెల్కొటే పార్క్, వనస్థలిపురంలోని రాజీవ్ గాంధీ పార్క్,  జగద్గిరిగుట్టలోని అస్ బెస్టాస్ కాలనీ పార్క్, తిరుమల హిల్స్ వాకర్స్​తో కళకళలాడుతున్నాయి. సిటీలోని గాజుల రామారం, మల్లాపూర్​తోపాటు పలు ప్రాంతాల్లో ఉమెన్ పార్క్, చిల్డ్రన్ థీమ్ పార్క్, మల్టీ జనరేషన్, స్పోర్ట్ థీమ్ పార్క్​లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. 

ప్రకృతి నడకలు..

హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ లాస్ట్ అర్బన్ నేచురల్ గ్రీన్ స్పేసెస్ (లంగ్స్) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. లంగ్స్ వాలంటీర్లు చీమలు, గబ్బిలాల పరిశీలన, సీతాకోకచిలుకలు, పక్షుల వీక్షణ, మిణుగురు పురుగుల సందర్శన, పచ్చని ప్రదేశాల పరిశీలన కార్యక్రమాలను చేపడుతున్నారు. ‘లాస్ట్ అర్బన్ నేచురల్ గ్రీన్ స్పేసెస్ ఆఫ్ హైదరాబాద్’ కార్యక్రమం కింద హైటికోస్ వాలంటీర్లు ప్రజలను పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి నెలా నిపుణులతోపాటు ప్రకృతి నడకలు సాగిస్తూ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌‌లోని పచ్చని ప్రాంతాలను గుర్తించి సిటీలో సామాజిక రక్షణ పొరను సృష్టించాలనుకుంటున్నామని వాలంటీర్ అంబికా రాజ్​పుత్ వివరించారు.

చీమల పరిశీలనకు యాంట్ వాక్  

చీమల పట్ల అమితమైన ఆసక్తి ఉన్న పాల్ ఆంటోనీ నేతృత్వంలో జరిగిన లంగ్స్ చీమల నడక కార్యక్రమం వాలంటీర్లకు చీమల ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఈ నడకలో అనేక చీమల జాతులు వెల్లడయ్యాయి. విజయ్ దీక్షిత్ నేతృత్వంలో జరిగిన ‘లంగ్స్ బటర్‌‌ఫ్లై వాక్’ సీతాకోకచిలుకలు, చిమ్మటల వైవిధ్యాన్ని దగ్గరగా చూసే అవకాశాన్ని కల్పించింది. ఈ నడకలో పాల్గొన్న వారికి ‘లంగ్స్’ గుర్తింపు కార్డును అందించారు. అలాగే అమీన్‌‌పూర్ సరస్సు ప్రాంతంలో పక్షుల వైవిధ్యాన్ని గమనించడం, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, పరిసరాల్లోని చిత్తడి నేలల ఆవాసాల పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించడంపై దృష్టి సారించింది. 

ఫికస్ గార్డెన్‌‌లో కీటకాల నడక

ఫికస్ గార్డెన్‌‌లోని హైటికోస్ వాలంటీర్లు కీటకాల నడక సాగించారు. ఈ నడకలో కీటకాలను సహజ సూక్ష్మ ఆవాసాలు, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వాటి పాత్రలను గుర్తించారు.సిటీలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌‌లో హైటికోస్ ఫౌండర్ ఇమ్రాన్ సిద్ధిఖీ నేతృత్వంలో సాగిన బర్డ్ వాక్​లో పక్షుల కిలకిలరావాలు, వాటి కదలికలను వాలంటీర్లు గుర్తించడం నేర్చుకున్నారు. దుర్గం చెరువులో ఇబ్రహీం వదూద్ నేతృత్వంలో సాగిన బర్డింగ్ వాక్ ఈ చెరువులు పక్షి వైవిధ్యాన్ని ఎలా పోషిస్తున్నాయో తెలుసుకున్నారు.

గ్రీన్ స్పేస్ వాక్  

నరసాపూర్ అడవిలో చిరెక్ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన నడకలో వృక్ష, జంతుజాలాలను పరిశీలించడం, అటవీ పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవడం, ఒక సహజ ఆవాసంలో జాతుల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని తెలుసుకునేలా దృష్టి సారించింది.

బ్యాట్​ వాక్

బీహెచ్ఈఎల్ దగ్గర వాలంటీర్లు పక్షులు, సీతాకోకచిలుకలు, మొక్కల జీవితంపై సంయుక్త దృష్టి సారించారు. డాక్టర్ ఆదిత్య శ్రీనివాసులు నేతృత్వంలో ఉస్మానియా  యూనివర్సిటీలో  జరిగిన గబ్బిలాల నడకలో ఆయన గబ్బిలాల ప్రవర్తన, ఆహారపు అలవాట్లు, ఎకోలొకేషన్ గురించి చెప్పారు.