గుజరాతీ బీట్‌కు.. మనోళ్ల జోష్! స్టెప్పులతో దుమ్మురేపే దాండియా!

 గుజరాతీ బీట్‌కు.. మనోళ్ల జోష్!  స్టెప్పులతో దుమ్మురేపే దాండియా!

దసరా వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌‌ సిటీలో సందడి షురూ! గర్బా స్టెప్పులు.. గుజరాతీ సంప్రదాయమైన దాండియా... ఇప్పుడు హైదరాబాద్ యువతకు ఫుల్ జోష్ ఇచ్చే ఫెస్టివల్‌‌గా మారిపోయింది. దాండియా స్టిక్స్ చేతిలోకి వచ్చాయంటే హైదరాబాద్ యువతీ, యువకుల కాళ్లు లయబద్ధంగా నాట్యమాడుతుంటాయి. బీట్ పడిందంటే చాలు ఫ్లోర్ మీద స్టెప్పులే స్టెప్పులు.. కలర్‌‌ఫుల్ డ్రెస్‌‌లు, డీజే సౌండ్స్‌‌తో దసరా నైట్ అదిరిపోతోంది. గుజరాతీ గర్బా డాన్స్ హైదరాబాదీ జోష్‌‌తో కలిసిపోయి సిటీ అంతా దాండియా దుమ్ము రేపుతోంది. ఈ ఏడాది హైదరాబాద్‌‌లో అక్టోబర్‌‌ 11 – 20వ తేదీల మధ్య శంషాబాద్ సిటాడెల్ హోటల్ కన్వెన్షన్​లో రాంగ్‌‌తాలి పేరిట 10 రాత్రుల గర్బా, దాండియా లైవ్ ఆర్కెస్ట్రా, డీజే వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

గుజరాత్ నుంచి హైదరాబాద్ దాకా..

గత ఏడాది హైదరాబాద్‌‌లో చిన్న కమ్యూనిటీ కార్యక్రమాల నుంచి కన్వెన్షన్ హాళ్లు, ఓపెన్ గ్రౌండ్​లు, పెద్ద వేదికల వరకు దాండియా వేడుకలు విస్తరించాయి. ఈ దాండియా వేడుకల కోసం నిర్వాహకులు బుక్ మై షోలోనూ టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ దాండియాలో పాల్గొనేందుకు నిర్వాహకులు రూ.99 నుంచి రూ.499ల దాకా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ దాండియా ఈవెంట్లలో సౌండ్ సెటప్​తో బ్రాండ్ ఎక్స్ పో, పంజాబీ ఢోల్, ఫుడ్, ఫ్యాషన్ స్టాళ్లు, కిడ్స్ ప్లే జోన్, ఫొటో బూత్​లు, బహుమతులు, లక్కీ డ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  

బతుకమ్మ పుష్పోత్సవాలు

హైదరాబాద్ అంతటా శరదృతువు ఆరంభం కాగానే, సంస్కృతి, లయ, భక్తి మేళవించే ఒక ఉత్సాహభరితమైన వేడుకగా నగరం మారిపోతుంది. విజయదశమి వరకు జరిగే నవరాత్రుల తొమ్మిది రాత్రులలో, వీధులు రంగురంగుల దీపాలు, భారీ డోలు వాయిద్యాలు, ఏకతాటిపై కర్రలు కొట్టుకునే విలక్షణమైన శబ్దంతో కళకళలాడతాయి. గచ్చిబౌలి, హైటెక్స్‌‌లోని భారీ బహిరంగ ఉత్సవాల నుంచి బేగంపేట్, మారేడ్‌‌పల్లిలోని సన్నిహిత సామూహిక వేడుకల వరకు, హైదరాబాద్ దసరా దాండియా, గర్బా కార్యక్రమాలు భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన సంప్రదాయాలను మేళవిస్తాయి.

మెరిసే చనియా చోళీలు, సంప్రదాయ కుర్తాలు, రంగురంగుల పట్టు వస్త్రాలు ధరించిన నృత్యకారులు, రాత్రి పొద్దుపోయే వరకు వలయాలుగా తిరుగుతూ నృత్యం చేస్తారు.  హైదరాబాద్ అంతటా జరిగే నవరాత్రి, దసరా వేడుకల సందర్భంగా సంప్రదాయ గర్బా బీట్​లు తెలంగాణ ఐకానిక్ బతుకమ్మ పూల పండుగ జానపద పాటలతో మిళితం చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ జానపద గీతం చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.., రామాణి శ్రీ రామ ఉయ్యాలో ఉయ్యాల పాటలు పాడంగ, గౌరమ్మ మాకు తోడుండ.. పాటలు తెలుగు గర్బా, దాండియా వేడుకల్లో వినిపిస్తున్నారు.

ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడంటే...

నెక్లెస్ రోడ్డు జలవిహార్​లో అక్టోబరు11 –19వతేదీ వరకు నవకార్ నవరాత్రి ఉత్సవ్ పేరిట తొమ్మిది రాత్రుల గర్బా, దాండియా లైవ్ మ్యూజిక్ ఉంటుంది. ఎల్.బి నగర్, బైరామాల్ గూడలోని ఎదులకంటి రాంరెడ్డి గార్డెన్స్​లో అక్టోబరు14 –18వ తేదీ వరకు రాస్​ గర్బా పేరిట గర్భా, దాండియా, లైవ్ ఆర్కెస్ట్రా వేడుకలు జరగనున్నాయి. నగరంలోని ప్రైమ్ ఏరీనాలో అక్టోబర్​16 –18వతేదీ వరకు మూడు రోజులపాటు ఆర్ట్స్ ఈవెంట్స్ దాండియా నైట్స్ పేరిట లైవ్ బ్యాండ్ ఉండనుంది. 

నవభారత్ దాండియా ఉత్సవ్ 2026 సికింద్రాబాద్​లోని వెస్లీ డిగ్రీ కళాశాల ఆవరణలో, హైదరాబాద్ బిగ్గెస్ట్ నవరాత్రి ఉత్సవ్ వెస్టిన్ మైండ్ స్పేస్​లో, నైట్స్ ప్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్​లో, పిండి పుల్లారెడ్డి గార్డెన్స్​లో రసరంగ్ 2026, నవ్‌‌కార్ గోల్డ్ వరల్డ్ దండియా మహోత్సవ్ 2026 – నాగోల్ సమతాపురి కాలనీలోని ఈషా కన్వెన్షన్‌‌లో పది రోజులపాటు నాన్‌‌స్టాప్ దాండియా, గర్బా, సంగీతం ఉంటుంది.

 దాండియా నైట్స్ 2026 – మణికొండ శ్రీ ఇన్ఫినిటీ కన్వెన్షన్ అండ్ బాంకెట్‌‌లో అక్టోబర్11–19 వరకు తొమ్మిది రాత్రులు గర్బా, సంగీతం, ఫుడ్ స్టాల్స్‌‌తో సందడిగా మారబోతోంది. ఏస్‌‌మేనియా దండియా నైట్ 2.0 – చంపాపేట్ మినర్వా గార్డెన్స్‌‌లో అక్టోబర్11న సంగీతం, ఫుడ్ అండ్ ఫీస్ట్. పిల్లలకు రూ.99 నుంచి, సింగిల్ రూ.299, కపుల్ రూ.549, గ్రూప్ రూ.1,399 పాస్ తీసుకోవాలి.

ఎస్‌‌కే నవరాత్రి ఉత్సవం – బేగంపేట్ పోలీస్ హాకీ స్టేడియంలో అక్టోబర్11–20 వరకు10 రాత్రులు సంగీతం, నృత్యం, విద్యుత్ కాంతులతో వేడుకలు జరగనున్నాయి.
సెలబ్రిటీ దాండియా నైట్స్ సీజన్10 – గచ్చిబౌలి ఫ్లిప్‌‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌‌లో అక్టోబర్ 9–20 వరకు గర్బా, దాండియా, లైవ్ బ్యాండ్, డీజే, డోలు, ఫుడ్ కౌంటర్లతో వేడుక. కార్పొరేట్ బృందాలకు ప్రత్యేక ఏర్పాట్లు, స్వచ్ఛమైన శాకాహార భోజనం ఉంటుంది.

మాస్​బీట్‌‌తో దాండియా సాంగ్స్

దసరా నవరాత్రి ఉత్సవాల్లో హైదరాబాద్ యాస, మాస్ బీట్‌‌తో హైదరాబాద్ దాండియా సాంగ్స్ దుమ్మురేపుతాయి. ‘‘దాండియా దాండియా.. దసరా దాండియా.. హైదరాబాద్ నగరం.. ఊగే రేయియా!’’ అంటూ డాన్స్​లు చేస్తారు. చార్మినార్ సాక్షిగా.. చిందులే చిందులు.. ట్యాంక్‌‌బండ్ దారుల్లో.. మోగే దాండియా డప్పులు! ‘‘రా రా రా.. గర్బా ఆడదాం.. హైదరాబాద్ నైట్‌‌ను ఫుల్‌‌గా ఊపేద్దాం!’’ అంటూ తెలంగాణ స్టెప్పుతో.. గుజరాతీ బీట్ దాండియా ఫ్లోర్ మీద.. అదిరే ట్రీట్ మారుమోగుతుంది. ‘‘హే చోగడ తారా, ఛబిలా తారా, రంగీలా తార, రంగభేరు తార..” సంప్రదాయ గుజరాతీ జానపద బీట్లు అలరిస్తున్నాయి. ‘‘ధోలిదా ధోల్ రే వగడ్, మారే హియారే ఘనేన్..’’ గంభీరమైన ధోల్ బీట్‌‌లతో కూడిన పాటలు ఉర్రూతలూగిస్తాయి. గోలియోన్​కి రాస్​లీలా రామ్-లీలాలో గాయకులు శ్రేయా ఘోషల్, ఒస్మాన్ మీర్ పాడిన ‘‘ధోల్ బాజే, ధోల్ బాజే, ధమ్ ధమ్ ధోల్ బాజే’’ పాటకు నృత్యం చేయడం మరవలేని మధురానుభూతిని నగరవాసులకు అందిస్తుంది.

ఇంకా... 

  •     దిల్ సే దాండియా 2026 శ్రీ ఇన్ఫినిటీ కన్వెన్షన్, మణికొండ అక్టోబర్ 11 – 19.
  •     నవభారత్ దాండియా ఉత్సవ్ వెస్లీ కాలేజ్ గ్రౌండ్స్, బేగంపేట అక్టోబర్ 11 – 19.
  •     రాంగ్తాలీ–సీజన్ 5 సిటాడెల్ సమావేశాలు, శంషాబాద్ అక్టోబర్ 11 – 20.
  •     రాస్ గర్బా వాల్యూమ్–08 ఎదులకంటి రామ్​రెడ్డి గార్డెన్స్, ఎల్బీనగర్ అక్టోబర్ 14 – 18
  •     ఇష్టా ఇష్టా కన్వెన్షన్ సెంటర్‌‌లో దాండియా ఉత్సవ్, హైటెక్ సిటీ నవరాత్రి.
  •     ఎస్​.కె నవరాత్రి ఉత్సవ్ ఇంపీరియల్ గార్డెన్స్, సికింద్రాబాద్ నవరాత్రి.
  •     సెలబ్రిటీ దాండియా నైట్స్ – సీజన్10 ఫ్లిప్‌‌సైడ్ అడ్వెంచర్ పార్క్ నవరాత్రి.
  •     ధూమ్ ధామ్ దాండియా ఫీనిక్స్ అరేనా నవరాత్రి. 
  •     ఎలైట్ దాండియా ఫెస్టివల్ తాజ్ దక్కన్ నవరాత్రి.
  •     నవకార్ నవరాత్రి ఉత్సవ్ జలవిహార్ నవరాత్రి.  
  •  కొంపల్లి దాండియా 2026కే టౌన్ అరేనా నవరాత్రి.