గాలె: శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో.. తుది జట్టు ఎంపికపై టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్ల మధ్య విపరీతమైన పోటీ ఉండటంతో.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం రాత్రి కొలంబోకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఇండియా ఆశలు డోలాయమానంగా ఉన్న తరుణంలో బలమైన తుది జట్టును బరిలోకి దించాలని భావిస్తున్నారు. దాంతో ఈ సిరీస్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందనే ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా మిడిలార్డర్, బౌలింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఎవరు బెటర్?
వామప్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ 142 రన్స్ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. దాంతో గాయపడిన సాయి సుదర్శన్ ఖాళీ చేసిన మూడో స్థానాన్ని పడిక్కల్ దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా మిడిలార్డర్‌లో అసలైన ఆరో ప్లేస్ కోసం సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇందులో ఒకరికే చాన్స్ ఉండటంతో ఎవరైతే బెటర్ అనే దానిపైనే మేనేజ్‌మెంట్ ఎక్కువగా దృష్టి సారించింది.
జురెల్‌కు గత టెస్ట్‌ల్లో ఆడిన అనుభవం ఉండటం టీమిండియాకు కలిసొస్తుందని మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరె అభిప్రాయపడ్డాడు. ‘సర్ఫరాజ్ కంటే జురెల్‌కు మొగ్గు ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతను ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో రాణించాడు. మంచి ఫీల్డర్ కూడా. సర్ఫరాజ్ ఆలస్యంగా జట్టులోకి వచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో సర్ఫరాజ్‌కు చాన్సెస్ వస్తాయి’ అని మోరె పేర్కొన్నాడు.
టెస్ట్‌ల్లో జురెల్ రికార్డు మెరుగ్గానే ఉంది. 10 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో సహా 34.14 సగటుతో 478 రన్స్ చేశాడు. అయితే గణాంకాలు ఫర్వాలేదనిపిస్తున్నా.. స్పిన్ బౌలింగ్‌లో జురెల్ ఔటవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సౌతాఫ్రికా–ఎతో జరిగిన అనధికారిక టెస్ట్‌లో రాణించిన జురెల్ ఆ తర్వాత జరిగిన సిరీస్‌లో తడబడ్డాడు. 14, 13, 0, 2 స్కోర్లు మాత్రమే చేశాడు.
సీనియర్ ఆఫ్ -స్పిన్నర్ సైమన్ హార్మర్ ప్రతి టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతన్ని అవుట్ చేసి, అతని బలహీనతలను పదేపదే బయటపెట్టాడు. శ్రీలంకలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. వార్మప్ మ్యాచ్‌లో జురెల్ 1, 17 రన్స్ చేసి ఆఫ్ -స్పిన్నర్ రమేష్ మెండిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాబట్టి స్పిన్‌కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్న గాలె పిచ్‌పై, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో స్పష్టమైన సందేహాలున్న బ్యాటర్‌ను ఎలా ఆడిస్తారన్న సందేహాలు మొదలయ్యాయి.
మరోవైపు స్పిన్‌ను ఎదుర్కోవడంలో సర్ఫరాజ్ దిట్ట అని మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ‘ఇప్పటికీ జట్టులో ఉన్న ఆటగాళ్లకే ఇండియా మద్దతు ఇస్తే, జురెల్‌కు అవకాశం దక్కొచ్చు. కానీ అది సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. స్పిన్‌ను ఎదుర్కోవడంలో సర్ఫరాజ్‌కు ఉన్న సామర్థ్యం అమోఘం. కాబట్టి తుది జట్టులో అతను ఉండటం చాలా మంచిది’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు.
స్పిన్‌ను ఎదుర్కోవడంలో సర్ఫరాజ్ అంత నమ్మకంగా పేరు సంపాదించుకున్న ఇండియా బ్యాటర్లు చాలా తక్కువగా ఉన్నారన్నాడు. సర్ఫరాజ్ ఫస్ట్-క్లాస్ రికార్డు అసాధారణంగా ఉందన్నాడు. 62 మ్యాచ్‌లలో 64.73 సగటుతో 5,114 రన్స్ చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.
సిరాజ్ నాయకత్వంలోనే..
ఈ సిరీస్‌లో ఇండియాకు మరో అతిపెద్ద సవాలు పేసర్ల రూపంలో ఎదురుకానుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిరీస్‌కు దూరం కావడంతో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ పేస్ బలగానికి నాయకత్వం వహించ నున్నాడు. తొలి టెస్ట్‌లో సిరాజ్‌తో కలిసి ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగే చాన్స్ ఎక్కువగా ఉంది.
అయితే పిచ్‌ను బట్టి మూడో సీమర్‌కు వెళ్తారా? లేక స్పిన్‌ను బలోపేతం చేసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. సాధారణంగా శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని అంటారు, కానీ సీమర్లు కూడా ప్రభావం చూపిస్తారని టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘నేను లంకలో ఆడినప్పుడల్లా, వికెట్లలో కాస్త ఎక్కువ తేమ ఉండేది. దాని వల్ల బంతి బాగా స్వింగ్ అయ్యేది’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ అందుబాటులో లేకపోవడం తో అవసరమైతే మూడో పేసర్‌గా గుర్నూర్ బ్రార్‌ను తీసుకోవాలని మోరె సూచించాడు.
అప్పుడు జడేజా, కుల్దీప్ ప్రధాన స్పిన్నర్ల బాధ్యతలు నిర్వహిస్తారన్నాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో పేస్ బాధ్యతలు ప్రధానంగా సిరాజ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. గతంలో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్‌లో బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 70 రన్స్‌కే 6 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
బుమ్రా భాగస్వామ్యం లేకుండా ఆడిన 17 టెస్టుల్లో సిరాజ్ 50 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు లీడ్ పేసర్‌గా అతని సామర్థ్యాన్ని చాటుతున్నాయి. కాబట్టి ఈ సిరీస్‌లో సిరాజ్ ఇండియాకు తురుపుముక్క అవుతాడని అంచనా వేస్తున్నారు.
