మీ స్పీచ్ అక్కర్లేదు.. రాజీనామా చేయాల్సిందే.. అమిత్షాకు రాహుల్ గాంధీ డిమాండ్

మీ స్పీచ్ అక్కర్లేదు.. రాజీనామా చేయాల్సిందే.. అమిత్షాకు రాహుల్ గాంధీ డిమాండ్
  • అమెరికా కోర్టులో అదానీపై కేసు కొట్టివేత వెనుక అనుమానాలు
  • మోదీ కాంప్రమైజ్ అయ్యారు 
  • దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపణలు

న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనలు, లాఠీచార్జ్‌‌‌‌ ఘటనలపై పార్లమెంట్‌‌‌‌లో చర్చకు రావాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం చేసిన ప్రకటనపై లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. సభలో అమిత్ షా ఇచ్చే స్పీచ్ తమకు అక్కర్లేదని.. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారన్న విషయమే దేశ యువత తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. 

బుధవారం అమిత్ షా ప్రకటన తర్వాత పార్లమెంట్ వద్ద మీడియాతో రాహుల్ మాట్లాడారు. ‘‘ఇప్పటికే పేలిపోయిన అమిత్ షా ‘ఇమేజ్ బెలూన్’లో ఆఖరి నిమిషంలో గాలి నింపే ప్రయత్నమే ఇది. కానీ ఆయన ఇమేజ్ బెలూన్ ఎప్పుడో పేలిపోయింది” అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌‌‌‌లో అమిత్ షా చెప్పే కల్పితాలను, ఉపన్యాసాన్ని వినేందుకు ప్రతిపక్షాలకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. 

‘‘అమిత్ షా ఆదేశాల మేరకే విద్యార్థులపై కాల్పులు జరిగితే ఆయన బాధ్యుడు. ఒకవేళ ఆదేశించకపోతే ఆయన అసమర్థుడు. ఈ రెండింటిలో ఏది జరిగినా.. ఆయన రాజీనామా చేయాల్సిందే” అని రాహుల్ మరోసారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తన మాటలకు అడ్డు తగులుతున్న జర్నలిస్టులపై కూడా ఆయన మండిపడ్డారు. 

అమిత్ షా మాట్లాడేటప్పుడు కూడా మీడియా ఇలాగే అడ్డు తగులుతుందా? అని ప్రశ్నించారు. మీడియా ఆయన ముందు ‘ఎలుక’లా ఎందుకు నిలబడుతోందని నిలదీశారు. విద్యార్థులు భయపడటం లేదు కాబట్టి మీడియా కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘అమిత్ షా ఏం మాట్లాడినా మాకు అవసరంలేదు. ఇరవై రోజుల పాటు ఆయన కనిపించకుండాపోయారు,. ఇప్పుడు వచ్చి సభలో కూర్చుంటున్నారు’’ అని ఆయన విమర్శించారు. 

అలాగే, జార్ఖండ్‌‌‌‌లో విద్యార్థుల నిరసనపై తాను మౌనంగా లేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘‘విద్యార్థులపై జరిగే ఎలాంటి హింసనూ మేం సహించబోమని నా ప్రెస్ మీట్‌‌‌‌లో స్పష్టంగా చెప్పాను. నేను మౌనంగా లేను, బహిరంగంగానే మాట్లాడుతున్నాను”అని ఆయన తెలిపారు. ‘‘ఒక వ్యక్తికి నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు, ఆయన మౌనమే ఆయన తరఫున మాట్లాడుతుంది. అమిత్ షా మౌనం ఆయన చేసిన నేరాన్ని అంగీకరించడమే” అని స్పష్టం చేశారు.

దేశ ప్రయోజనాలను మోదీ తాకట్టు పెట్టారు

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను అమెరికా ఫెడరల్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రయోజనాలను ప్రధాని మోదీ తాకట్టు పెట్టారని, దీనివల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆరోపించారు. 

ఈ వ్యవహారం వెనుక ‘కనిపించని కోణాలు’ ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. యూఎస్ న్యాయస్థానం కేసులను కొట్టివేసిన వార్తను ‘ఎక్స్’  వేదికగా పంచుకుంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.‘‘దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ఒక  లొంగిపోయిన ప్రధాని బలవంతపు నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి భారత్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది” అని వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది?

అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లపై ఉన్న కేసులను శాశ్వతంగా కొట్టివేస్తూ యూఎస్ జస్టిస్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఇచ్చిన పిటిషన్‌‌‌‌ను ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ ఆమోదించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈవో వినీత్ జైన్‌‌‌‌పై దాఖలైన సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్‌‌‌‌పైరసీ, వైర్ ఫ్రాడ్ కాన్స్‌‌‌‌పైరసీ, సెక్యూరిటీస్ ఫ్రాడ్ తీవ్ర ఆరోపణల కేసులను ‘విత్ ప్రిజుడీస్’ పద్ధతిలో కోర్టు రద్దు చేసింది.