ఇండీ కూటమి కీలక నిర్ణయం: అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ మార్చ్

ఇండీ కూటమి కీలక నిర్ణయం: అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ మార్చ్

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష తీరుకు నిరసనగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఈ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

సర్ ప్రక్రియలో అవకతవకలు, ఎన్నికల సంఘంలో విభేధాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వన్ మ్యాన్ షోతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున అధ్యక్షతన బుధవారం (సెప్టెంబర్ 30) దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైంది. ఈ భేటీలో సుధీర్ఘంగా చర్చించిన కూటమి నేతలు ఉమ్మడి భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. 

అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ మార్చ్ చేపట్టాలని కూటమి తీర్మానించింది. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ల ఎదుట కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, అక్టోబర్ 6న ఎంపీలతో కలిసి సీఈసీ కార్యాలయం ముట్టడి, దేశవ్యాప్తంగా ఐదు భారీ సభలు, నవంబర్ 1న ఢిల్లీలో భారీ సభ నిర్వహించాలని కూటమి నిర్ణయించింది. 

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కలిగించాలంటే భవిష్యత్తులో ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలో జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈవీఎంల విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు. ఈవీఎం మెషీన్లను బీజేపీ తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు.. హంగ్ ఏర్పడాలన్నా, ఎన్నికల్లో గెలవాలన్నా, ఓడించాలన్నా.. తమకు అనుకూలంగా మెషిన్లను వాడుకుంటున్నారని అన్నారు.

 ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం ఏర్పడాలంటే బ్యాలట్ ఓట్ల పద్ధతిని పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్ల మాటలను బేఖాతరు చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‎ను వెంటనే పదవి నుంచి తొలగించి అతడిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈసీని ప్రధాని మోడీ, అమిత్ షా తోలుబొమ్మలా వాడుతున్నారని.. అందుకే ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నారని ఆరోపించారు.