- ఎలక్ట్రిక్ టూవీలర్లలో.. పాత బ్రాండ్ల హవా..
- సెప్టెంబర్ అమ్మకాల్లో టీవీఎస్, బజాజ్, హీరో (విడా) వాటా 62 శాతం
న్యూఢిల్లీ: మనదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునే కస్టమర్ల ఆలోచనల్లో పెద్ద మార్పు కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీల కంటే, దశాబ్దాలుగా నమ్మకమున్న పాత కంపెనీల బండ్ల వైపే జనం మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్ మొదటి 28 రోజుల్లో అమ్ముడైన మొత్తం ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో దాదాపు 62 శాతం (61.8శాతం) వాటాను టీవీఎస్, బజాజ్, హీరో మోటోకార్ప్‌కి చెందిన విడా కంపెనీలే కైవసం చేసుకున్నాయి. ప్రభుత్వ 'వాహన్' పోర్టల్ తాజా లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఎవరి వాటా ఎంతంటే?
1. ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్‌లో టీవీఎస్ నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో 49,677 ఈవీ రిజిస్ట్రేషన్లతో, 26.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
2. బజాజ్ చేతక్ ఈవీల అమ్మకాలు నెలనెలా పెరుగుతున్నాయి. ఈ నెలలో 44,480 యూనిట్లు అమ్మి, 23.6 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది.
3. హీరో సపోర్ట్ ఉన్న విడా 22,109 బండ్లను (11.7శాతం వాటా) విక్రయించింది. మరోవైపు ఏథర్ ఎనర్జీ 27,690 యూనిట్లు అమ్మింది. ఏథర్ ఇటీవల తెచ్చిన బడ్జెట్ మోడల్ 'కోణార్క్' అమ్మకాలు సెప్టెంబర్ 21 నుంచే మొదలయ్యాయి కాబట్టి, దాని అసలు ప్రభావం అక్టోబర్‌లో కనిపించనుంది. ఈ బండిని రూ.99 వేలకు కంపెనీ అమ్ముతోంది.
ఓలా కుదేల్
ఒకప్పుడు ఈవీ మార్కెట్‌ను ఏలిన ఓలా ఎలక్ట్రిక్ వాటా దారుణంగా పడిపోయింది. కేవలం 11,984 స్కూటర్లను మాత్రమే నమోదు చేసి, 6.4 శాతం మార్కెట్ వాటాకే పరిమితమైంది. ఈవీలు మార్కెట్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఓలా, ఏథర్ వంటి కొత్త తరం కంపెనీలు ఫీచర్లు, యాప్‌లతో ఆకట్టుకున్నాయి. కానీ రోజులు గడిచేకొద్దీ కొనుగోలుదారులకు సర్వీసింగ్ సమస్యలు, స్పేర్ పార్ట్స్ కొరత పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక్కడే టీవీఎస్, బజాజ్, హీరోల బలం బయటపడింది. ఏ ఊరికి వెళ్లినా దొరికే షోరూమ్‌లు, రిపేర్ చేసే మెకానిక్‌లు, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ వీరికి ఉన్నాయి.
దీంతో జనం వీటివైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో ఈ మూడు కంపెనీల వాటా ఈ ఏడాది జులైలో 60.6 శాతంగా, ఆగస్టులో 59.5 శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో 61.8 శాతానికి చేరింది. ఈ నెలలో ఇప్పటివరకు దేశం మొత్తం మీద 1.88 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు రిజిస్టర్ అయ్యాయి. ఇది ఆగస్టు మొత్తం (1.83 లక్షలు) కంటే ఎక్కువ. మార్కెట్ పెరుగుతున్నా, పాత బ్రాండ్ల ఆధిపత్యం మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది.
