యుద్ధాలకు తోడైన ఎల్‌నినో: అతిపెద్ద ఆహార సంక్షోభానికి సిద్ధంగా ఉండండి: మంత్రి జైశంకర్

యుద్ధాలకు తోడైన ఎల్‌నినో: అతిపెద్ద ఆహార సంక్షోభానికి సిద్ధంగా ఉండండి: మంత్రి జైశంకర్

ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న రాబోయే కాలపు ఆహార, ఇంధన సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, ఇరాన్-గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న 'ఆసియా సొసైటీ' వేదికగా జైశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎరువుల కొరత తీవ్రమైందని.. రాబోయే నెలల్లో ఇది ఒక భారీ 'ఆహార సంక్షోభానికి' దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేశారు జైశంకర్. ముఖ్యంగా బ్లాక్ సీ ప్రాంతం నుంచి గోధుమలు, ఇతర ప్రధాన ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే దేశాలు తమ షిప్‌మెంట్లను సరిగ్గా పంపలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీనికితోడు ప్రపంచంలోనే కీలకమైన ఎరువుల ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్న పశ్చిమాసియా, రష్యాలలో జరుగుతున్న పరిణామాల వల్ల ఎరువుల ఉత్పత్తి దెబ్బతిందని వివరించారు.

ఈ ఆహార, ఎరువుల కొరత సమస్యలకు వాతావరణ మార్పులు కూడా తోడయ్యాయని జైశంకర్ పేర్కొన్నారు. సూపర్ ఎల్ నినో వంటి విపరీతమైన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచం ఇంధన కొరతతో అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా ఆహారం, ఎరువుల కొరత, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఒకేసారి ముంచుకొచ్చి 'డబుల్ క్రైసిస్'సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంధన మార్కెట్లు ఇప్పటికే చాలా క్లిష్టంగా ఉన్నాయని.. ఈ తరుణంలో కొందరు దీనిపై రాజకీయాలు చేయడం వల్ల మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని జైశంకర్ విమర్శించారు. క్రూడ్ సరఫరా భద్రత, దాని వెనుక నడుస్తున్న రాజకీయం ఒకదానికొకటి ముడిపడి పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం తలెత్తినప్పుడు పెట్టుబడులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు జైశంకర్. 

అభివృద్ధి చెందిన దేశాలు తమ స్వార్థ రాజకీయాల కోసం తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాల ప్రజల జీవితాలను ఎంతగానో కష్టాల్లోకి నెడుతున్నాయని జైశంకర్ మండిపడ్డారు. "మా ఉద్దేశం మీ జీవితాలను కష్టపర్చడం కాదని చెప్పి చేతులు దులుపుకోవడం సరికాదు" అని ఆయన హితవు పలికారు. ఇంధన సంక్షోభం ఇప్పటికే అనేక దేశాల్లో రాజకీయ అస్థిరతకు దారితీసిందని, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత దీనికి సంబంధించిన ఉదాహరణలను మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చూశామని ఆయన గుర్తుచేశారు. ఈ విక్షుబ్ధ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.