బ్లూ డ్రమ్ మర్డర్ కేసు: ఆ లవర్స్ ఇద్దరూ దోషులే.. శిక్షపై అందరిలో ఆసక్తి

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు: ఆ లవర్స్ ఇద్దరూ దోషులే.. శిక్షపై అందరిలో ఆసక్తి

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలను మీరట్ కోర్టు దోషులుగా తేల్చింది. 13 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం మీరట్ జిల్లా కోర్టు జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా ఈ తీర్పును వెలువరించారు. నిందితులకు శిక్ష పడటంలో ప్రాసిక్యూషన్ కీలకంగా వ్యవహారించింది. 22 మందికి పైగా సాక్షులను విచారించి ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను సమర్పించింది. నిందితులు ఇద్దరికి మరణశిక్ష శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరింది. ఈ కేసులో నిందితులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం త్వరలోనే వారికి శిక్షను ఖరారు చేయనుంది. 

అసలేం జరిగిందంటే..?

మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్‎ను అతడి భార్య ముస్కాన్ ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన 2025, మార్చిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సౌరభ్ డెడ్ బాడీని 15 ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‎తో సీల్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‎లో జరిగింది.

మర్చంట్ నేవీ అధికారి అయిన సౌరభ్ , ముస్కాన్ రస్తోగి 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో సౌరభ్ తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అయితే, లవ్ మ్యారేజ్ చేసుకోవడం, జాబ్ వదిలేయటం వంటి సౌరభ్ నిర్ణయాలు అతని కుటుంబానికి నచ్చలేదు. అందువల్ల ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దాంతో సౌరభ్ తన భార్యతో కలిసి వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

మూడేండ్ల క్రితం ఇందిరానగర్లోని అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. 2019లోనే వారికి ఒక కుమార్తె కూడా పుట్టింది. వేరు కాపురం పెట్టాక ముస్కాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముస్కాన్ తన లవర్ సాహిల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సౌరభ్కు తెలిసింది. దాంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సౌరభ్ విడాకుల నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నాడు. 2023లో మళ్లీ మర్చంట్ నేవీలో జాబ్లో చేరాడు.

►ALSO READ | మసాలా దోశ చెబితే.. చచ్చిన ఎలుకతో ఇచ్చాడు..

ఫిబ్రవరి 28న తన కూతురు బర్త్ డే ఉండటంతో సౌరభ్ 2025, ఫిబ్రవరి 24న తన ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే మార్చి 4న సౌరభ్ తినే ఆహారంలో ముస్కాన్ నిద్రమాత్రలు కలిపింది. ఆపై సాహిల్, ముస్కాన్ కలిసి సౌరభ్ను కత్తితో పొడిచి చంపారు. డెడ్ బాడీని 15 ముక్కలుగా కోసి, డ్రమ్ములో వేసి, సిమెంటుతో సీల్ చేశారు. సౌరభ్ గురించి అడిగిన వాళ్లకు అతను హిమాచల్ ప్రదేశ్కు టూర్ వెళ్లాడని చెప్పి ముస్కాన్ నమ్మించింది. కానీ సౌరభ్ తమ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ముస్కాన్, సాహిల్‎ను విచారించగా.. సౌరభ్ను చంపేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 13 నెలల విచారణ అనంతరం ఈ కేసులో ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‎ను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. త్వరలోనే నిందితులకు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది. దీంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.