కొందరు హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు పరిశుభ్రత అన్న పదాన్నే మర్చిపోతున్నారు. కాసుల కక్కుర్తిలో పడి కల్తీ, నాణ్యత లేని వస్తువులతో వంటకాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. మొన్న బిర్యానీలో బల్లి.. నిన్న ఐస్ క్రీమ్ లో బొద్దింక ప్రత్యక్షమైన ఘటనలు మరువకముందే లేటేస్ట్ గా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఈసారి ఏకంగా మసాలా దోశలో చచ్చిన ఎలుక ప్రత్యక్షమైంది. ఇది చూసిన కస్టమర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
అమిత్ త్రివేది అనే కస్టమర్ సోమవారం (సెప్టెంబర్ 28) తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై సిటీలోని బోరివలి వెస్ట్ ఎల్.టి. రోడ్డులోని రాధాకృష్ణ హోటల్‌కు వెళ్లారు. మైసూర్ మసాలా దోశ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన దోశను కొంచెం తిన్న తర్వాత అందులో చనిపోయిన ఎలుక కనిపించింది. తాను తిన్న దోశలో ఎలుకను చూసిన సదరు కస్టమర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అక్కడే వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటనపై హోటల్ సిబ్బందిని నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కస్టమర్ ఈ ఘటనపై బోరివలి పోలీసులను ఆశ్రయించి హోటల్‌పై ఫిర్యాదు చేశారు.
Mumbai - A disturbing food safety complaint has emerged from Borivali West after a customer alleged that a small dead rat was found inside a dosa served at a hotel on L.T. Road. According to the complainant, the family had visited the hotel for a meal and ordered a Mysore masala… pic.twitter.com/ByxGgaIMlh
— NextMinute News (@nextminutenews7) September 29, 2026
కస్టమర్ కంప్లైంట్‌ను బోరివలి పోలీసులు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫార్వార్డ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎఫ్‌డీఏ రాధాకృష్ణ హోటల్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో నిర్ధారించడానికి రాధాకృష్ణ హోటల్‌ను తనిఖీ చేయాలని ఎఫ్‌డీఏ అధికారులను ఆదేశించింది. హోటల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనతో ముంబై నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్ పరిశుభ్రత, భద్రతపై కొత్త ఆందోళనలు తలెత్తాయి.
